– పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మహారాష్ట్ర ఈసీ నోటీసులు
– స్పందించిన సామాజిక మాధ్యమాలు
– పలు పోస్టులు డిలీట్
ముంబయి : ఎన్నికల వేళ సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తల విషయంలో మహారాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు పంపింది. ఓటర్లలో గందరగోళం కలిగిస్తున్న నకిలీ వార్తలను ప్రచారం చేసే 1752 పోస్టులను తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల తర్వాత వీటిలో 300 మందికి పైగా పోస్టులను తొలగించబడ్డాయని ఒక అధికారిక ప్రకటన వివరించింది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 79(3)(బి) కింద నోటీసులను పంపినట్టు అధికారులు తెలిపారు. ”అభ్యంతరకర పోస్టులు ఫేస్‌బుక్‌లో 143, ఇన్‌స్టాగ్రామ్‌లో 280, ఎక్స్‌లో 1296, యూట్యూబ్‌లో 31, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో రెండింటిని కనుగొన్నారు. ఈసీ నుంచి నోటీసులు అందిన తర్వాత నుంచి ఇందులో ఫేస్‌బుక్ 16 పోస్టులను తొలగించగా.. 127 పోస్టులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. ఇక ఇన్‌స్టాగ్రామ్ 29 పోస్టులు, ఎక్స్ 251, యూట్యూబ్ ఐదు పోస్టులను డిలీట్ చేశాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఈసీ సి-విజిల్ యాప్ ద్వారా 420 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 414 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. థానే జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులకు పరిష్కారం లభించాయి” అని అధికారిక ప్రకటన వివరించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.10.64 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మందు, ఖరీదైన ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నది.