– పాఠ్యపుస్తకాల్లో కోతలు, తొలగింపులపై ఆక్షేపణ
– ఎన్‌సీఈఆర్‌టీకి పొలిటికల్ సైన్స్ పుస్తకాల కమిటీ సలహాదారుల లేఖ
న్యూఢిల్లీ : పాఠ్యపుస్తకాల కమిటీలో ఉండటం ఇబ్బందిగా ఉందనీ, పొలిటికల్ సైన్స్ పుస్తకాల కమిటీ నుంచి తమను తొలగించాలని ఎన్‌సీఈఆర్‌టీకి సలహాదారులు లేఖ రాశారు. 2006-07 నుంచి ప్రచురించబడిన 9 నుంచి 12 తరగతుల పొలిటికల్ సైన్స్ పుస్తకాలకు ముఖ్య సలహాదారులుగా ఉన్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్‌లు ఎన్‌సీఈఆర్‌టీకి రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ పాఠశాల పాఠ్యపుస్తకాలను ఛిద్రం చేసిందనీ, వాటిని విద్యాపరంగా పనిచేయనిదిగా మార్చిందని పేర్కొన్నారు. పాఠశాల పాఠ్యపుస్తకాల్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ఇటీవల చేసిన ‘అసంఖ్యాకమైన తొలగింపులు అహేతుకమైనవి’ అని ఆక్షేపించారు. అందువల్ల ప్రస్తుత రూపంలో ఉన్న పాఠ్యపుస్తకాల కమిటీలో తమ పేర్లను తొలగించాలని అభ్యర్థించారు. కోవిడ్-19 వల్ల ఏర్పడిన నేర్చుకునే అంతరాయాల నుంచి విద్యార్థులు కోలుకోవడానికి పాఠ్యాంశాలను తగ్గించే సాకుతో గతేడాది (ఈ సంవత్సరం అమలులో) చేసిన భారీ మార్పులు, తొలగింపులు చాలాకాలంగా విమర్శలకు, వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ మార్పులలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అన్ని సూచనలను తొలగించడం, మొఘల్ శకం, కుల వ్యవస్థకు సంబంధించిన కంటెంట్‌ను తగ్గించడం, నిరసనలు, సామాజిక ఉద్యమాలపై అధ్యాయాలను తొలగించడం వంటివి ఉన్నాయి. ‘ఏదైనా పాఠ్యాంశాల్లో అంతర్గత తర్కం ఉంటుంది. ఇలాంటి ఏకపక్ష కోతలు, తొలగింపులు పుస్తకాల స్ఫూర్తిని ఉల్లంఘిస్తాయని మేం నమ్ముతున్నాం. తరచుగా, వరుస తొలగింపులు అధికారాలను సంతోషపెట్టడానికి తప్ప ఎటువంటి లాజిక్‌ను కలిగి ఉన్నట్టు కనిపించడం లేదు’ అని యాదవ్, పల్షికర్ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ డిఎస్ సక్లానీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆకృతిలో ఉన్న పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు పొలిటికల్ సైన్స్‌లో శిక్షణ ఇవ్వడానికి పనికిరావని అన్నారు. ‘ఈ మార్పులు విద్యాపరంగా పనికిరావు. పుస్తకాల్లో మా పేర్లను ఉంచటం మాకు ఇబ్బందిగా ఉంది. మా పేర్లను తొలగించాలి’ అంటూ సక్లానీని యాదవ్, పల్షికర్ అభ్యర్థించారు.