నవతెలంగాణ – వలిగొండ రూరల్
వెల్వర్తి గ్రామం నుండి అరూర్ వరకు గుంతలమైన నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సీపీఐ(ఎం) పోరుబాట కార్యక్రమంలో భాగంగా వెల్వర్తి గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ.. వెల్వర్తి గ్రామం నుండి అరూరు వరకు నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసే అనేకమంది ప్రయాణికులకు రైతులకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుందని అనేకమంది ఈ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారన్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు స్థానిక భువనగిరి ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. వెలువర్తి మొగిలి పాక గ్రామాలకు చెందిన అనేకమంది ప్రజలు అరూరు వేములకొండ గ్రామాల్లో బ్యాంకు పనుల నిమిత్తం, ఇతర పనుల కోసం నిత్యం ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తుంటారని గుంతలతో ఇబ్బందుల గురవుతున్నారని, గతంలో ఉన్న అధికారులు స్పందించకపోవడం వల్ల ఈ రోడ్డుకు ఈ పరిస్థితి దాపురించిందని వెంటనే ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అదేవిధంగా వెలువర్తి గ్రామం నుండి వలిగొండకు ప్రయాణం చేసే వలిగొండ వెల్వర్తి గ్రామాల మధ్యన వర్షాకాలం వచ్చిన సందర్భంలో ఇబ్బందులకు గురి చేసే కల్వర్టులను బ్రిడ్జిలుగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఇండ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. వెల్వర్తి-కేర్చిపల్లి గ్రామాల మధ్యన ఉన్న బీటీ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కల్కూరి ముత్యాలు,శాఖ కార్యదర్శి కల్కూరి వాసు,కూచుమల్ల కిష్టయ్య,గ్రామ రైతులు ఎడవెల్లి పాపయ్య, నరసింహ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.