బిల్డర్లకు ‘రెరా’ జరిమానాలు

'Rera' penalties for builders– నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పదు
– చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్‌ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై పాలకమండలి కన్నెర్ర చేసింది. మౌఖికంగా చెప్పినా, షోకాజ్‌ నోటీసులు జారీ చేసినా, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంస్థలపై ‘రెరా’ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ కొరడా ఝళిపించారు. పలు సంస్థలకు భారీ మొత్తంలో జరిమానాలు విధించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా సొంతింటి కలలు నెరవేరుస్తామంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని శ్రీనివాసం డెవలపర్స్‌ సంస్థకు రూ. 3 లక్షలు, కుత్బుల్లాపూర్‌ సుచిత్ర ప్రాంతంలోని డీఎన్‌ఎస్‌ ఇన్ఫ్రా కంపెనీకి రూ.36.50 లక్షలు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు రూ.25 లక్షలు అపరాధరుసుముగా విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ‘రెరా’ నిబంధనలు ఉల్లంఘించి ఈ సంస్థలు అడ్వర్‌ టైజింగ్‌, మార్కెటింగ్‌ కార్యక్రమాలు చేపడుతున్నాయని చైర్మెన్‌ వివరించారు. ‘రెరా’ వినియోగదారుల పక్షాన నిలుస్తుందనీ, వారి హక్కులకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.

Spread the love