రామగుండం మెడికల్‌ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్‌

– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రామగుండం మెడికల్‌ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, 23 ఆల్‌ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 127 సీట్లలో ఐదు శాతం రిజర్వేషన్‌ ప్రకారం7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించారు. నీట్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణనలోకి తీసుకుంటారు.
సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. వీటితో పాటు మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో 50 పడకలను సింగరేణి ఉద్యోగులకు కేటాయించింది. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ సౌకర్యాన్ని సింగరేణి ఉద్యోగుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్‌ కాలేజీ పేరును సింగరేణి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌)గా మార్చినట్టు తెలిపారు.

Spread the love