– ఓయూలో పొ. సూరజ్ మండల్
నవతెలంగాణ-ఓయూ
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రొఫెసర్ సూరజ్ మండల్ (బీపీ మండల్ మనుమడు) డిమాండ్ చేశారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో ‘చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓయూ తెలుగు విభాగం హెడ్ ప్రొ.సి. కాశీం అధ్యక్షత వహించగా ప్రొ. సూరజ్ మండల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జనాభాలో 60 శాతం గల బీసీలకు చట్టసభల్లో వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల ద్వారానే సామాజిక న్యాయం జరిగి అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొ. ప్రభంజన్ యాదవ్, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు కంచర్ల బద్రీ, రాములుగౌడ్, నరేందర్ గౌడ్, నాగేష్ ముదిరాజ్,డా.మేడి. రమణ, స్వరూప,అధ్యాపకులు,విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.