ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం

Identifying as Government Servants Resolution in Assembly–  జీపీ కార్మికుల డిమాండ్‌.. 31 రోజులు పూర్తయిన సమ్మె
– బోధన్‌ పట్టణంలో భారీ ర్యాలీ, పలుచోట్ల వినూత్న తరహాలో నిరసనలు
– హక్కులను కాలరాసి టెంట్ల వద్ద మొసలికన్నీరు కారుస్తున్న బీజేపీ నేతలు
నవతెలంగాణ-బోధన్‌/ విలేకరులు
వేతనాలు పెంచి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 31 రోజులు పూర్తయింది. శనివారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో గ్రామ పంచాయతీ కార్మికులతో భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రత్యక్షసేవలందిస్తున్న పంచాయతీ సిబ్బంది పట్ల ప్రభుత్వం వివక్ష పాటించడం శోచనీయమన్నారు. నూటికి 80శాతం మంది దళితులు గ్రామ పంచాయతీ కార్మికులు కావడం వల్లే వివక్ష కొనసాగిస్తున్నారా అని ఆమె విమర్శించారు. మోడీ స్వచ్చ భారత్‌, కేసీఆర్‌ పచ్చదనం పరిశుభ్రత పిలుపును చిత్తశుద్ధితో అమలు చేశారని అన్నారు. ఎన్నికలకు ముందు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేస్తామని సీఎం వాగ్దానం చేసి 9 ఏండ్లు గడిచినా ఎందుకు చేయలేదన్నారు. ధరలు బారేడు, జీతం జానెడు ఉంటే ఎలా అని ఎద్దేవా చేశారు. వేతనాలు పెంపు కోసం ప్రభుత్వం రూపొందించిన జీవో నెంబర్‌ 60 ప్రకారం గ్రామపంచాయతీ సిబ్బందికి రూ.19వేలు ఇవ్వాలన్నారు. రూ. 8500తో ఎలా జీవిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వేతనాలు పెంచకుండా పని భారం పెంచడానికి జీవో నెంబర్‌ 51ని రూపొందించి ఒకే కార్మికుడు అనేక పనులు చేయాలనే మల్టీపర్పస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టడడం సరికాదన్నారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెలో గొంతెమ్మ కోర్కెలు లేవని, న్యాయం, ధర్మం నీతి మాత్రమే ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ కార్మికుల హక్కులను కాలరాసే చర్యలకు ఒడిగట్టిందన్నారు. బీజేపీ నేతలు నేడు టెంట్ల వద్దకు వచ్చి మద్దతు ఇచ్చినప్పటికీ అసలు కార్మికుల ప్రాథమిక హక్కులను లేకుండా చేస్తున్నది బీజేపీ అనేది మరువకూడదన్నారు. కార్పొరేట్లకు ఉపయోగపడే 4 లేబర్‌ కోడ్‌లను తెచ్చి కార్మికుల పొట్టలు కొడుతుందన్నారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిన ఘనత బీజేపీ సర్కార్‌దేనని వీటిపై ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీపీ జేఏసీని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్‌ గౌడ్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్‌, జిల్లా నాయకులు ఖాజమోహినోద్దిన్‌, గ్రామపంచాయతీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నన్నేసాబ్‌, జిల్లా ఉపాధ్యక్షులు సాగర్‌, రాజేశ్వరి, రేఖ, పద్మ, జాకీర్‌, అశోక్‌, సాయిలు, హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో బండారు చందర్రావు భవన్లో నియోజకవర్గ కో కన్వీనర్‌ కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు హాజరై మాట్లాడారు. పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి, మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేసి, కార్మికుల సమ్మెను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్‌ ఇండియా డే సందర్భంగా ఆగస్టు 9, 10 తేదీలలో దేశవ్యాప్తంగా కలెక్టరేట్‌ ఎదుట కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న మహా పడావ్‌ ధర్నాకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. దమ్మపేట మండలంలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కార్మికులు నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌, ఎర్రుపాలెం మండలాల్లో ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారు.

Spread the love