– మీసేవా కేంద్రాలు తనిఖీ
నవతెలంగాణ-డిచ్‌పల్లి
”నవతెలంగాణ” దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘మీ సేవలో మాయజాలం?’ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇందల్ వాయి మండలంలోని పలు చోట్ల ఉన్న మీసేవ కేంద్రాలకు జిల్లా ఉన్నతాధికారులు, తహసిల్దార్ వెంకట్రావు ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారి మోహన్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మీ సేవ సెంటర్ చుట్టుపక్కల పలువురిని, సర్టిఫికెట్లకు దరఖాస్తులు చేసుకున్న వారితో, గతంలో ఫిర్యాదులు చేసిన వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక మీసేవాకేంద్రంలో చీరెలు, గాజులు తదితర వాటిని ఉంచుకొని వ్యాపారం చేస్తుండడంతో మండల రెవెన్యూ అధికారి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ వెంకట్రావు, మండల రెవెన్యూ అధికారి మోహన్ మాట్లాడుతూ పలు మీసేవ కేంద్రాలను సందర్శించినప్పుడు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, ఇంకోన్ని లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. మొదటిసారి వాళ్లకు హెచ్చరించడం జరిగిందని, మరోసారి నిబంధనలకంటే ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే మీ సేవ సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. పలువురి నుండి వివరణ తీసుకున్నామని వాటిని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని మండల రెవెన్యూ అధికారి మోహన్ నవతెలంగాణ వివరించారు. ఒకటి, రెండు రోజుల్లోనే మండలంలో ఉన్న మీసేవ సెంటర్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు వివరిస్తామన్నారు. మీ సేవ సెంటర్లలో వచ్చిన దరఖాస్తులను వెంటనే తాసిల్దార్ కార్యాలయానికి అప్పజెప్పాలని ఆదేశించారు.