రోహిత్‌కు విశ్రాంతి?!

– జూన్‌ 27న టెస్టు జట్టు ఎంపిక
– భారత జట్టు కరీబియన్‌ పర్యటన
ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో విరామం లేకుండా ఆడుతూ.. జాతీయ జట్టు తరఫున ఆడేందుకు విశ్రాంతి తీసుకునే సంప్రదాయం కొనసాగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతుంది!. ద్వైపాక్షిక సిరీస్‌లలో కీలక ఆటగాళ్లు లేకపోవటంతో యువ క్రికెటర్లు అవకాశాలు అందిపుచ్చుకుని రాణిస్తున్నారు. కానీ మెగా ఈవెంట్లకు జట్లను ఎంపిక చేసే సమయంలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రాణించిన ఆటగాళ్లను పక్కనపెట్టి, సీనియర్‌ క్రికెటర్లను జట్టులోకి ఎంపిక చేస్తున్నారు. ఈ విధానంతో భారత క్రికెట్‌కు తీరని అన్యాయం జరుగుతున్నా.. బీసీసీఐ పెద్దలు పునరాలోచన చేయటం లేదు. జాతీయ జట్టు షెడ్యూల్‌లో విశ్రాంతి కోరుకునే క్రికెటర్లపై మాజీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నా.. పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండటం లేదు. తాజాగా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసింది. భారత జట్టు తదుపరి సవాల్‌కు సరిగ్గా నెల రోజుల సమయం చిక్కింది. జులై 12 నుంచి వెస్టిండీస్‌ జట్టుతో టీమ్‌ ఇండియా టెస్టు సమరం షురూ కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనంతరం భారత క్రికెటర్లు విరామం తీసుకుంటున్నారు. అయినా, కరీబియన్‌ పర్యటన నుంచి కొంతమంది క్రికెటర్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
రహానెకు పగ్గాలు! : కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిలు కరీబియన్‌ పర్యటనలో కొంత సమయం విశ్రాంతి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రోహిత్‌ శర్మ అటు ఐపీఎల్‌లో, ఇటు డబ్ల్యూటీసీ ఫైనల్లో పెద్దగా రాణించలేదు. విరాట్‌ కోహ్లి ఫర్వాలేదనిపించినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మరో మెగా ఫైనల్లో అంచనాలను చేరుకోలేదు. రెండు టెస్టుల్లో ఆడితే.. మూడు వన్డేలు, ఐదు టీ20ల నుంచి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. లేదంటే వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ఆడితే.. రెడ్‌బాల్‌ సిరీస్‌కు దూరం కానున్నారు. దీనిపై సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో మాట్లాడే అవకాశం ఉంది. రోహిత్‌, విరాట్‌తో మాట్లాడిన అనంతరం సెలక్షన్‌ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. రోహిత్‌ శర్మ టెస్టులకు దూరమైతే అజింక్య రహానెకు తాత్కాలిక సారథ్య పగ్గాలు దక్కనుండగా.. వైట్‌బాల్‌ సిరీస్‌లో హార్దిక్‌ పాండ్య వన్డేలు, టీ20ల్లో ముందుండి నడిపించనున్నాడు. పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న చతేశ్వర్‌ పుజార జట్టులో చోటు గల్లంతు చేసుకునే ప్రమాదంలో పడ్డాడు. రోహిత్‌, విరాట్‌లకు విశ్రాంతి దక్కితే.. పుజారకు మరో అవకాశం లభించినట్టే చెప్పవచ్చు!. వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూన్‌ 27న భారత జట్లను ఎంపిక చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం.

Spread the love