నేడు ఫలితాలు

– అసెంబ్లీ కౌంటింగ్‌కు వేళాయే
– తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
– గెలుపునాదే.. మంత్రి నేనే
– గెలుపు ఓటములపై ఎవరి ధీమా వారిదే
– అందరి అంచనాలకు నేడు తుది ఫలితం
– మధ్యాహ్నం వరకే తేలిపోనున్న భవితవ్వం
– భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
ఎవరి అంచనాలు వారివే.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. గెలుపు నాదే.. మంత్రి వర్గంలో చోటూనాకే అంటూ ప్రచార ఆర్భాటాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరి అంచనాలకు నేడు మధ్యాహ్నం వరకే బ్రేక్‌ పడనుంది. నియోజకవర్గ ఓటర్లు ఎవరి పక్షమో తేలిపోనుంది. మరోసారి మంచిరెడ్డి కిషన్‌ రెడ్డికే అభయమిచ్చారా? మార్పును కోరుకున్నారా? నాలుగు పర్యాయాలు ఓటమిపాలైన మల్‌రెడ్డి రంగారెడ్డిని ఆశీర్వదించారా? వామపక్షాలకు బలాన్నిచ్చారా? అనేది తేలిపోనుంది. కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ ఆదివారం వీడనుంది. నెల రోజుల విస్తత ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్లను, అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ప్రతి నియోజక వర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అదనంగా మరో టేబుల్‌ ఏర్పాటు చేశారు. తొలుత ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంట తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసా గుతుంది.
కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌
కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్రలు, జెండాలు, తుపాకులు వంటి ఆయుధాలతో సంచరించడం నిషేధమని.. పోలీసులు తెలిపారు. పాటలు పాడటం, స్పీకర్లు వినియోగించడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. ప్లకార్డులు, ఇతర గుర్తులు, ఫొటోలు ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో టెంట్లు, షామియానాలు వేయకూడదని పేర్కొన్నారు. మైకుల ద్వారా ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ ఆంక్షలు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి.. సోమవారం ఉదయం 6 గంటలు వరకూ అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీవీఆర్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమును సీపీ చౌహాన్‌ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు.
సీవీఆర్‌లోనే మూడు స్థానాల కౌటింగ్‌
ఇబ్రహీంపట్నం సమీపంలోని సీవీఆర్‌ ఇంజీనింగ్‌ కళాశాలలోనే మూడు స్థానాల కౌటింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజక వర్గాల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 327,583 ఓటర్లున్నారు. వీరిలో 2,45,459 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు 161,786 మందికిగాను 121483 మంది ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. పురుషులు 165,760 మంది ఓటర్లు ఉంటే, వీరిలో 123968 మంది ఓట్లువేశారు. ఇతరులు 37 మందికి కేవలం 8 మంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 74.93శాతం పోలింగ్‌ నమోదైంది. అసెంబ్లీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇక అందరూ తమకే ఓటర్లు మద్దతు ఇచ్చారని లెక్కలేసుకుంటున్నారు. గెలిస్తే మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరి అంచనాలను నేడు తుది ఫలితం రానుంది. మధ్యాహ్నం వరకే అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.

Spread the love