– సీఎం రేవంత్ సమస్యలను పక్కదారి పట్టించేందుకే బూతు పురాణం
– రుణమాఫీపై సర్కార్ లెక్కలన్ని అబద్దాలే
– మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆన్నారు. సీఎం తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎంపై నిప్పులు చెరిగారు. ”రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఒకటి వర్షాలతో వచ్చిన వరద అయితే, రెండు చిల్లర ముఖ్యమంత్రి అబద్దాల వరద. వరదలతో వచ్చిన బురదను కడుక్కోగలుగుతున్నం. కానీ ముఖ్యమంత్రి నోటి నుంచి వస్తున్న మురుగు బురదను మాత్రం కడగలేకపోతున్నాం.మోరీల కంపును మించి పోయింది ముఖ్యమంత్రి నోటి కంపు. రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని మాట్లాడుతుండు. నేను నీ గుండెల్లో దాక్కున్నా. అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తా. సర్కార్ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించాను. మిగతా సగం రుణమాఫీ చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటా. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నిద్ర పోను” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా ఎత్తు గురించి మాట్లాడుతున్న సీఎం, తన ఎత్తు గురించి కూడా ఆలోచించాలని గుర్తు చేశారు. నేను తెలంగాణ ఉద్యమంలో తాటి చెట్టంత ఎదిగా, నువ్వు మాత్రం వెంపలి చెట్టంత కూడా ఎదుగలేదంటూ విమర్శించారు. లిల్లీపుట్ అని నేను ఆనలేనా? సన్నాసి అని నేను అనలేనా అంటూ? ఎదురు దాడి చేశారు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించాలని సూచించారు. రూ.4,000 పించన్, మహిళలకు రూ. 2,500 , ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎక్కడ హమీలను నిలదీస్తారోననే భయంతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ”అసలు ఫోర్త్ సిటీ ఎక్కడిది? గత సర్కార్ రూ.1500 కోట్లు ఖర్చుపెట్టి 12 వేల ఎకరాలను పార్మాసిటీ కోసం సేకరించింది. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నావు..కాంగ్రెస్ అధికారంలోకి వస్తె ఫార్మా సిటీ భూములు వాపస్ అన్నావు. అయితే పార్మాసిటీ పెట్టు, లేదంటే భూములు ఇవ్వు. ఈ డ్రామా ఏమిటి” అని నిలదీశారు. అదృష్టం బాగుండి గెలిచిన రేవంత్ రెడ్డి, మరోసారీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రెండో సారీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఇటీవల కాలంలో లేదని గుర్తు చేశారు. రేవంత్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల్లో తొమ్మిది మత కలహాలు జరుగాయని గుర్తు చేశారు. ప్రతిపక్షాలపై బూతు పురాణాలు మానేసి ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు.