పునరాలోచించాలి

జీఓ ఎత్తివేతతో దాదాపు ఏడు మండలాల పరిధిలోని 84గ్రామాల్లో రియాల్టీకి ఊపు పెరుగుతుంది. కానీ పర్యావరణం దెబ్బతింటుంది.
అందుబాటులోకి వచ్చే 1.5లక్షల ఎకరాల భూమి నిర్మాణరంగం కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు. ఉస్మాన్‌సాగర్‌,
హిమాయత్‌సాగర్‌ జలాల అవసరం ప్రస్తుతం హైదరాబాద్‌కు లేదనీ, కృష్ణా, గోదావరులతో మరో వందేండ్ల వరకు మహానగరానికి తాగునీటి కొరత రాదని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలోనే చెప్పారు. అయితే నిజానికి ఆ ఏడు మండలాల్లో ఇప్పుడున్న పరిస్థితులు విభిన్నం.
స్థానిక రైతులు తమ భూములు అమ్మేసుకుని వాటిలోనే
కూలీలుగా మారిపోయారు.
నీరు ప్రాణాధారమన్నాడో కవి…
అన్నింటికి నీరుకావాల్సిందే… నీలువ నీడకై కరువు, నీలువ నీటితో చెరువు… నీరు లేక ఊరు ఎలా బతుకుతుంది… మనుషులకే కాదు పశుపక్షాదులకు తాగునీరు… పంట పొలాలకు సాగునీరు… నేనుంటే ఇంట్లో వండిన కుండ ఉన్నట్టే” ఇది చెరువు స్వగతం. ఆరో తరగతి పుస్తకంలో విద్యార్థులకు సర్కారు చెబుతున్న పాఠం. చెరువు అవసరం, దాని ప్రాధాన్యతను ఈ పాఠం చెప్పకనేచెబుతున్నది. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. మూడు దశాబ్దాల క్రితం గండిపేట(ఉస్మాన్‌సాగర్‌), హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చిన జీఓ 111ను రాష్ట్ర ప్రభుత్వం తాజా క్యాబినెట్‌ సమావేశంలో రద్దు చేసింది. ఈనేపథ్యంలో రియల్టర్లు, స్థానిక ప్రజలు సంతోషపడుతుండగా, పర్యావరణవేత్తలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ జీఓను ఎత్తేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలోనే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రకటించాయి. జంట జలాశయాలతో హైదరాబాద్‌ మహానగరానికి తాగునీటి వసతి కల్పించడం కోసం నైజాం కాలంలోనే ఒక ప్రత్యేక ‘ఫర్మానా’ ఉండేది. ఆ తర్వాత వచ్చిన పౌర ప్రభుత్వాలు తెచ్చిన అనేక జీఓల్లో కీలకమైంది 111. ఆ రెండు జలాశయాల చుట్టూ 10కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలు చేయడం, జలాలు కలుషితం కాకుండా చూడటం. జీవవైవిధ్యంతోపాటు పర్యావరణాన్ని కాపాడటం కీలక కర్తవ్యాలు. ఈ జీఓ పరిధి ఆవల భూముల ధరలకు రెక్కలొచ్చి కోట్లకు పడగలెత్తాయి. కానీ లోపల సొంతిండ్లు కూడా నిర్మించుకోలేని దుస్థితిలోకి స్థానికులు వెళ్లిపోవడంతో సహజంగానే ఆందోళనకు కారణమయ్యాయి. విశాల దృక్పథంతో పరిశీలించిప్పుడు దాదాపు కోటి జనాభాకు ఆశ్రయమిస్తున్న హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, అదే సందర్భంలో స్థానిక ప్రజల అవసరాలు తీర్చటం సర్కారుకు కత్తిమీద సామే అయింది.
జీఓ ఎత్తివేతతో దాదాపు ఏడు మండలాల పరిధిలోని 84గ్రామాల్లో రియాల్టీకి ఊపు పెరుగుతుంది. కానీ పర్యావరణం దెబ్బతింటుంది. అందుబాటులోకి వచ్చే 1.5లక్షల ఎకరాల భూమి నిర్మాణరంగం కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాల అవసరం ప్రస్తుతం హైదరాబాద్‌కు లేదనీ, కృష్ణా, గోదావరులతో మరో వందేండ్ల వరకు మహానగరానికి తాగునీటి కొరత రాదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలోనే చెప్పారు. అయితే నిజానికి ఆ ఏడు మండలాల్లో ఇప్పుడున్న పరిస్థితులు విభిన్నం. స్థానిక రైతులు తమ భూములు అమ్మేసుకుని వాటిలోనే కూలీలుగా మారిపోయారు. స్థానిక అంచనాల ప్రకారం ప్రజల దగ్గర ఉన్న భూమి కేవలం 25శాతమే. మిగతా 75శాతం పెట్టుబడిదారులు, రియల్టర్ల కబంధ హస్తాల్లోకి ఎప్పుడో వెళ్లిపోయిందన్నది కాదలేని నగసత్యం. నిర్మాణాల మూలంగా వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు వచ్చి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందనే సంగతిని ఆ రంగంలోని నిపుణులు నెత్తినోరూ మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. గంగానది పక్కన కాన్పూర్‌ నగర నిర్మాణమే నేటి చక్కటి ఉదాహరణ. రాష్ట్ర రాజధానిలోని సరూర్‌నగర్‌, కాప్రా, ప్రగతినగర్‌ చెరువులూ అంతే. మూసీ, హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన పేర వందల కోట్ల ప్రజాధనం అక్రమార్కులకు ఫలహరమే తప్ప ఫాయిదా లేదు. రియల్టర్ల మాయాజాలంలో ప్రభుత్వాలు చిక్కుకుని, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నాయి.
అసలు ఈ జీఓ వెనుక ప్రజల ప్రయోజనం కన్నా ఇతరేతరమే అధికం. బీనామీల పేరుతో వేల ఎకరాలు సొంతం చేసుకున్న పెద్దలు, ఎకో ఫ్రెండ్లీ సిటీ పేరుతో లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయని ప్రతిపక్షాలు గుర్రుమంటున్నాయి. నీటివనరుల వృద్ధితోనే జీవవైవిద్యం పరిఢవిల్లుతుంది. అంతేగాక సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హారితహారం, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ ప్రకృతి వనాల పెంపుతోనే నీటివనరులు వృద్ధి చెందాయని అంటున్నారు. జీఓ 111 ఎత్తివేతతో తన విధానాన్ని తానే రద్దు చేసుకుంటున్నది. తాను కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటున్నది. జీఓ ఎత్తివేత చర్య మహానగరంపై అణుబాంబు లాంటిదేనంటూ పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కోణమే తప్ప ప్రజాకోణం లేదంటున్నాయి ప్రతిపక్షాలు. అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే, దీర్ఘకాలిక ప్రజల ప్రయోజనాలు పరిరక్షించబడేవనే వాదన బలంగా వినిపిస్తున్నది.

Spread the love