ఇంజక్షన్‌ వికటించి రిటైర్డ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

– బంధువుల ఆందోళనతో దిగొచ్చిన వైద్యాధికారులు
– ఆస్పత్రిని తనిఖీ చేసిన పోలిస్‌, వైద్య, రెవెన్యూ అధికారులు
– కాలం చెల్లిన శాంపిళ్లను సేకరించి ఆస్పత్రి సీజ్‌
నవతెలంగాణ-హసన్‌పర్తి
ఇంజక్షన్‌ వికటించి వృద్దుడు మృతి చెందిన ఘటన వినాయక చవితి పండుగ రోజు హసన్‌పర్తిలో సంచలనం రేపింది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రిటైర్డ్‌ హెడ్‌కానిస్టేబుల్‌కు రెండు ఇంజక్షన్‌లు వేయడంతో ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇదే ఆసుపత్రి వైద్యుడు 108 అంబులెన్స్‌కి సమాచారం అందించి ఎంజీఎం తరలించగా రోగి మృతి చెందినట్లు ఎంజీఎం వైద్యులు తెలి పారు. సారయ్య మృతితో బందువులు ఆందోళనకు గురయ్యారు. ఇంజక్షన్‌ విక టించి మృతి చెందిన ఘటనపై హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపికి ఫిర్యాదు చేయగా సంబందిత వైద్యాధికారులతో విచారణ చేయించి ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రెడ్డి, తహశీల్దారు చల్ల ప్రసాద్‌, మృతుని కుమారుడు రాజేంద్రప్రసాద్‌ కథనం ప్రకారం… మండలంలోని చింతగట్టు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ నద్దునూరి సారయ్య (63) అనారోగ్యంతో హసన్‌పర్తికి చెందిన డాక్టర్‌ సముద్రాల శంకర్‌ ఆసుపత్రికి చికిత్స కోసం తన భార్యతో కలిసి సోమవారం వచ్చారు. ఈ క్రమంలో సంబందిత వైద్యడు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే రెండు ఇంజక్షన్‌లు ఇవ్వడంతో కొద్ది సేపటికే సారయ్య ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న వైద్యుడు శంకర్‌ వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మెరుగైన వైద్య చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సారయ్య పరిస్థితి విషమించడంతో సంబందిత డాక్టర్‌ శంకర్‌ను ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలను నమోదు చేసేందుకు ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వాలని కోరారు. దీంతో వైద్యుడు నిరాకరించడంతో బాదితుడి కుమారుడు రాజేందర్‌ కోపగించు కోవడంతో ఒక ఇంజక్షన్‌ ఇచ్చానని బుకాయించడంతో బాదితుడి భార్య మాత్రం తన భర్తకు రెండు ఇంజక్షన్‌లు ఇచ్చారని కొద్ది సేపటికే తన భర్త అపస్మారక స్థితికి చేరుకున్నట్లు ఆవేధన వ్యక్తం చేసింది. వెంటనే డాక్టర్‌ శంకర్‌ మాత్రం ఒక ఎవిల్‌ ఇంజక్షన్‌ మాత్రమే ఇచ్చినట్లు అంబులెన్స్‌ సిబ్బందికి తెలిపారు. అక్కడే ఉన్న మృతుడి కుమారుడు తన తండ్రికి ఏవిధమైన చికిత్స అందించారో తెలిపేందుకు ఎంజీఎంకు తనతో రావాలని కోరడంతో నిరాకరించిన వైద్యుడిపై దాడి చేసేం దుకు కుటుంబ సభ్యుల యత్నించారు. వెంటనే సంబందిత వైద్యుడు అంబులెన్స్‌లో ఎంజీఎంకు బయలుదేరాడు. ఎంజీఎంకు సాయ్యకు మెరుగైన వైద్య చికిత్స చేసేందుకు చేర్పించడంతో అప్పటికే మృతి చెందినట్లు ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న డాక్టర్‌ శంకర్‌ను అతని కుమారుడు డాక్టర్‌ రవితేజ పారిపోయేందుకు సహకరించినట్లు మృతుని బందువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. సారయ్య మృతికి కారణమైన డాక్టర్‌ శంకర్‌, పారిపోయేందుకు సహకరించిన డాక్టర్‌ రవితేజతో పాటు ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్న ఫార్మసిస్టు శ్యామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి తెలిపారు.
ఆసుపత్రి సీజ్‌
ఇంజక్షన్‌ వికటించి రిటైర్డ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సారయ్య మృతితో అప్రమత్తమైన ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మదన్‌ మోహన్‌రావు, డిస్ట్రిక్ట్‌ స్టాటిస్ట్రికల్‌ ఆఫీసర్‌ ప్రసన్నకుమార్‌, తహశీల్దారు చల్ల ప్రసాద్‌ లు మంగళవారం డాక్టర్‌ సముద్రాల శంకర్‌ ఆసుపత్రిని సీజ్‌ చేశారు. సోమవారం ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మదన్‌మోహన్‌, తహశీల్దారు చల్ల ప్రసాద్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వాణిశ్రీ నేతృత్వంలో ఆస్పుత్రిలో తనిఖీలు చేశారు. ఆసుపత్రిని పరిశీలించి అందులో వైద్యుడు వాడిన సూది మందులతో పాటు ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. అపరిశుభ్రమైన వాతావరణంతో పాటు ఆసుపత్రిలో కాలం చెల్లిన సూదిమందులు, మెడిసిన్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రిలో వాడిన కాలం చెల్లిన సూదిమందులు, మెడిసిన్‌ శాంపిళ్లను సేకరించి ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఈ తనిఖీలలో డాక్టర్‌ విజరురావు, డిప్యూటీ తహశీల్దారు మహ్మద్‌ రహీం, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రణరు, ఎస్సై ఎండీ.వలీ, ఏఎస్సై జనార్ధన్‌, వైద్య సిబ్బంది కందుకూరి సంతోష్‌, ఇంద్రసేనారెడ్డి, నిర్మళతో సిబ్బంది ఉన్నారు.

Spread the love