తిరోగమన పాఠాలు

      దేశ ఔన్నత్యానికి ప్రతీక అయిన భిన్నత్వంలో ఏకత్వం, లౌకికత అంటే పడని పాలకుల కనుసన్నల్లో తయారైన ఈ విద్యావిధానం రానున్న రోజుల్లో భావి భారత విద్యార్థిని మతతత్వంలో మూఢత్వంలో మునిగితేలేలా చేస్తుంది. ఇందుకు అనుగుణంగా కేంద్రమే చరిత్రను పూర్తిగా వక్రీకరించే పనికి పూనుకుంది. ఇప్పటిదాకా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య ఇకపై కేంద్ర ప్రభుత్వ పెత్తనంలోకి వెళ్లనుండడంతో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగనుంది.
ఇక మనం ‘చదువని వాడజ్ఞుండగు’ అనే పోతన పద్యాన్ని ‘చదివిన వాడజ్ఞుండగు’ అని తిరగేసి చదువుకోవాలి. మత పరమైన, మనువాద భావజాలంతో విద్య వ్యవస్థను కలుషితం చేసే కుట్రలు వేగం పుంజుకుంటున్నాయి. పురాణాలు, వేదాలు, జ్యోతిష్యం, హస్త సాముద్రికం, చిలుక జ్యోస్యాలు వంటివి ప్రవేశపెట్టి, విద్యార్థుల మెదళ్లను వికసించకుండా మూఢత్వాన్ని నింపుతుంటే ఇక శాస్త్రీయభావాలకు చోటుందా? విద్యా ప్రగతికి బాటుంటుందా?! తాజాగా ‘మహర్షి పాణిని సంస్కృతం, వేద విశ్వవిద్యాలయం’ కాన్వకేషన్‌లో పాల్గొన్న ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… ”ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు సంస్కృతాన్ని చాలా ఇష్టపడతారు. ఇది కంప్యూటర్ల భాషకు సరిపోతుంది. కృత్రిమ మేధస్సు నేర్చుకునే వారు దానిని నేర్చుకుంటారు. గణన కోసం సంస్కృతాన్ని ఎలా ఉపయోగించవచ్చనే దానిపై చాలా పరిశోధనలు జరుగు తున్నాయి” అని సెలవిచ్చారు. సాక్షాత్తు ఇస్రో చైర్మనే ఇలా మాట్లాడితే విద్యార్థులకు సైన్స్‌ మీద నమ్మకం ఎలా కలుగుతుంది? అసలు ఇలాంటి వ్యక్తికి ఒక్కక్షణమైనా ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా?
డెబ్పైఐదేండ్లుగా స్వాతంత్య్ర దేశంలో మనశక్తిని మనం పెంచుకోవటానికి, సాధికారతను సాధించుకోవటానికి, సొంతఆలోచనతో శాస్త్రసాంకేతికరంగంలో, పరిశోధనలో ప్రగతిని పొందేందుకు తగిన విద్యను మలచుకునేందుకు నిదానంగానైనా కొన్ని అడుగులు పడ్డాయి. కానీ, గత దశాబ్ధకాలంగా పరిశోధనలో ఒక్క ముందడుగు లేదు. ప్రపంచానికి భారతదేశం ఆదర్శమనే ప్రచారాలకైతే తక్కువేం లేదు గానీ, దాని వెనకాల ఉన్న చేదునిజాలివి.
ఢిల్లీ విశ్వవిద్యాలయం(డియూ) పాలక మండలి గతవారం రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యావేత్తలను, మేధావులను విస్మయానికి గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు కర్నాటక పయినించిన బాటలో నేడు డియూ నడుస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత ‘అంబేద్కర్‌ ఫిలాసఫీని’, స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశభక్తిని పాదుకొల్పిన ‘సారే జహాసే అచ్చా’ గీత రచయిత ఇక్బాల్‌కు సంబంధించిన ‘మోడ్రన్‌ ఇండియన్‌ పొలిటికల్‌ థాట్‌’ అనే చాప్టర్‌ను పొలిటికల్‌ సైన్స్‌ నుంచి తొలగింపు నిర్ణయం తీసుకుంది. ‘హిందూత్వపై అధ్యయన కేంద్రం’, ‘దేశ విభజనపై అధ్యయన కేంద్రం’ ఏర్పాటుకు యూనివర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రాజనీతి శాస్త్రం కోర్సులో ఉన్న మహాత్మాగాంధీ జీవితం, ఆలోచనలపై ఉన్న పాఠ్యాంశాన్ని తొలగించి కరడుకట్టిన హిందూత్వవాది సావర్కర్‌ పాఠానికి గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఇది అత్యంత దారుణమైన గర్హనీయమైన నిర్ణయం. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా యూనివర్సిటీలు కాషాయరంగు పులుముకుంటున్నా యనడాని ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
శాస్త్రీయ విద్యావిధానం అమలుకై విద్యావ్యవస్థలో సమూలమార్పులు రావాలని అందరం ఏన్నో ఏండ్లుగా ఆశిస్తున్నాం. దీనిని అదనుగా తీసుకున్న బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అత్యంత లోపభూయిష్టమై విద్యావిధానం అమలుకు పూనుకుంది. దీనికి విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా లెక్కచేయకుండా అమలు చేయాలని రాష్ట్రాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. నూతనత్వం పేరుతో మధ్యయుగాల నాటి విద్య మళ్లీ రాజ్యమేలబోతోంది. ప్రధాని మొదలుకొని వర్సిటీల ఉపకులపతుల దాకా మూఢత్వంలో కూరుకుపోతున్నారు. తాజాగా ఆ కోవలోకి ఇస్రో కూడా చేరిపోతే అది 21 శతాబ్దపు అత్యంత విషాదం.
దేశ ఔన్నత్యానికి ప్రతీక అయిన భిన్నత్వంలో ఏకత్వం, లౌకికత అంటే పడని పాలకుల కనుసన్నల్లో తయారైన ఈ విద్యావిధానం రానున్న రోజుల్లో భావి భారత విద్యార్థిని మతతత్వంలో మూఢత్వంలో మునిగితేలేలా చేస్తుంది. ఇందుకు అనుగుణంగా కేంద్రమే చరిత్రను పూర్తిగా వక్రీకరించే పనికి పూనుకుంది. ఇప్పటిదాకా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య ఇకపై కేంద్ర ప్రభుత్వ పెత్తనంలోకి వెళ్లనుండడంతో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగనుంది. హిందుత్వ నినాదాలైన ‘ఒకే దేశం-ఒకే జాతి- ఒకే మతం-ఒకే దేవుడు-ఒకే భాష..’ వరుసలోకి ఒకే విద్య కూడా చేరబోతోంది. అంటే కాషాయీ కరణకు మార్గం సుగమం అవుతోంది.
ప్రగతిశీల భావాలను అడ్డుకుంటూ విశ్వవిద్యాలయాలకు నిధుల్లో కోతలు పెడుతోంది. విద్య కాషాయీకరణ, మతోన్మాద ధోరణులు పెచ్చరిల్లుతున్న క్రమంలో నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెడుతోంది. మరింత హీన సంస్కృతిని పెంచి, విద్యను అంగడి సరుకుగా మారుస్తోంది. ఒక ప్రగతిశీల రాజ్యం అవతరణకు శాస్త్రీయ దృక్పథం గల ప్రజలు అవసరం. అందుకే శాస్త్రీయ పురోగతిని సాధించడం మన రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటిగా నిర్దేశించుకున్నాం. కానీ ఏడున్నర దశాబ్దాలుగా ఈ లక్ష్యానికి చేరువకావడానికి సాగుతున్న ప్రయత్నాలన్నింటికీ ఇప్పుడు ప్రమాదమేర్పడింది. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి మనకున్న మార్గం దాన్ని ఓడించడమే.

Spread the love