అప్పుపై హరీశ్ రావు క్లారిటీ… అమ్మిన విషయాలు చెప్పాలని రేవంత్ రెడ్డి కౌంటర్

నవతెలంగాణ – హైదరాబాద్: అప్పుల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సాగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు పదేపదే కేసీఆర్ హయంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి వారసత్వంగా రూ.72 వేల కోట్ల అప్పులు వచ్చాయని తెలిపారు. ఈ రూ.7 లక్షల కోట్ల అప్పులో కొన్ని చెల్లించినవి… కొన్ని చెల్లించనివి ఉన్నాయన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే తాము చేసిన అప్పులు రూ.4 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఉంటుందన్నారు. అయినా, తాము చేసిన అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ నేతలు తాము కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, సమ్మక్క బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్, సుందిళ్ల భక్తరామదాసు ప్రాజెక్టు… ఇలా ఎన్నో ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు నీరు ఇచ్చామన్నారు. ఇదంతా తాము తయారు చేసిన ఆస్తులు కాదా? అని ప్రశ్నించారు. రైతు వేదికలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇలా ఎన్నో నిర్మించామన్నారు. రైతుబంధుపై రూ.72 వేల కోట్లు, రైతు రుణమాఫీకి రూ.28 వేల కోట్లు, ఆసరా పెన్షన్‌కు… ఇలా ఎన్నింటినో ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పిందని, కానీ దానిని రూ.25 వేలకు తగ్గించిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం సంతోషమేనని… కానీ వైద్య శాఖకు నిధుల కేటాయింపు తగ్గిస్తే ఇది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్ పేరు నచ్చకుంటే పేరు మార్చి కిట్లు ఇవ్వాలని సూచించారు. కానీ రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టవద్దని సూచించారు. ఆరు గ్యారెంటీలపై బాండ్ పేపర్ ఇచ్చి మరీ మోసం చేశారని మండిపడ్డారు. బాండ్ పేపర్ వ్యాల్యూ తీసేశారన్నారు.
అప్పుల లెక్కలు చెప్పి… అమ్మకాల లెక్కలు చెప్పడం లేదు
హరీశ్ రావు అప్పుల లెక్క చెప్పే సమయంలో అమ్ముకున్న లెక్కలు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ప్రాజెక్టులు కట్టినందుకు అప్పులు అయ్యాయని చెబుతున్న మాజీ మంత్రి… భూములు అమ్మిన విషయం ఎందుకు చెప్పలేదన్నారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారని ఆరోపించారు. రూ.700 కోట్ల గొర్రెల పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇటీవల రూ.80 వేల కోట్లు ఖర్చు చేశామన్న బీఆర్ఎస్, ఇప్పుడు రూ.94 వేల కోట్లు అంటోందని విమర్శించారు. అయితే తాము ఓఆర్ఆర్‌ను విక్రయించలేదని, అది తిరిగి ప్రభుత్వానికే వస్తుందని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.94 వేల కోట్లు ఖర్చయ్యాయని తామ మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. బతుకమ్మ చీరలపై అసత్యాలు చెప్పి మహిళలను అవమానించారని ఇందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరారు.

Spread the love