నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికలను సొంత బిడ్డల్లా భావించాలని, వారికి పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
బడి పిల్లలకు అందించే ఆహారం విషయంలో పునరావృతం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ఈ విషయంలో ఉదాసీనంగా ప్రవర్తించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్లక్ష్య ప్రవర్తన రుజువైతే అధికారులను చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. వసతి గృహాలు, గురుకులాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. గత పదేళ్లలో గల్లంతైన విద్యావ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే క్రమంలో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం స్వచ్ఛమైన హృదయంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. విద్యార్థుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, దురుద్దేశంతో ప్రభుత్వం పరువు తీసేలా కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనకు దిగుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.