కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌

Revanth Reddy is a challenge to KTR– కొడంగల్‌ను అభివృద్ధి చేస్తే.. నాపై పోటీ చేయాలి
– ఆరు గ్యారంటీలు అమలు జరగాలంటే కాంగ్రెస్‌ రావాలి
– డీకే శివకుమార్‌ కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించండి
– వేలాదిమందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు
నవతెలంగాణ-కొడంగల్‌
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తే కేటీఆర్‌ తనపై పోటీ చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీసి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చరిత్రలో కొడంగల్‌కు మొదటిసారి మంచి అవకాశం వచ్చిందని, ఇదంతా కొడంగల్‌ ప్రజలు ఇచ్చిందేనని తెలిపారు. కొడంగల్‌కు కృష్ణా జలాలు, జూనియర్‌ కళాశాలలు, కంపెనీలు వస్తాయని, సిద్దిపేట, సిరిసిల్ల వలే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, సిమెంటు ఫ్యాక్టరీలు, మహబూబ్‌ నగర్‌-చించోలి జాతీయ రహదారి పనులు పూర్తికాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని తీసుకువస్తే దాన్ని కలరాసారన్నారు, గొల్ల, కురుమ సోదరులు రూ.40 వేలు డీడీలు కట్టినా ఇప్పటికీ గొర్రెలు పంపిణీ చేయలేదని విమర్శించారు. కొడంగల్‌ ప్రజలు ఓట్లు వేసి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించుకుంటే కొడంగల్‌ ప్రాంతానికి ఎందుకు న్యాయం చేయలేదన్నారు.
కొడంగల్‌ బిడ్డలు ఏ ప్రాంతానికి వెళ్లినా కొడంగల్‌ అంటే కుర్చీ వేసి కూర్చోబెట్టే విధంగా కృషి చేస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, మీ బిడ్డగా వెళుతున్నానని, కొడంగల్‌ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ జగదీశ్వర్‌ రెడ్డి, మండలాధ్యక్షులు నందరం ప్రశాంత్‌, టీపీసీసీ ప్రతినిధి యూసుఫ్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, పట్టణ అధ్యక్షులు నయుం, దౌల్తాబాద్‌ మండల అధ్యక్షులు వెంకట్‌ రావు, బోడి వెంకట్‌ రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love