నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రనష్టం సంభవించింది. ఈ క్రమంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం ఏపీ, తెలంగాణలలో పర్యటించింది. నేడు సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణలో వరద వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయానికి నిధులు అందించాలని కోరారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందన్నారు.