నవతెలంగాణ-హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీయేలో చేరుతానని చెప్పారన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మోడీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మోడీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్నారు. మోడీ-కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ చెప్పిందే నిజమైందన్నారు. నిజామాబాద్ గడ్డపై మరోసారి ఈ బంధం బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో కుస్తీ పడుతున్నారన్నారు. ఇన్నాళ్లు తాము చెప్పిందే నిజమైందన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నం చేసింది నిజమే… అలాగే వారిద్దరు మిత్రులేనన్నది అంతకంటే నిజమన్నారు. నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదన్నారు.