‘ముఖ్యమంత్రి’ అభ్యర్థిపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌లో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేతకాక ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. సొంతగా విద్యుత్ ఉత్పత్తి చేయడం చేతగాని వ్యక్తి తమపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఏ సబ్ స్టేషన్‌కైనా వెళ్దాం.. ఎక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నారో చూపించాలని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామన్నారు. కాంగ్రెస్‌పై అబద్దాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి, ప్రయివేటు కంపెనీల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. రూ.3 కు వచ్చే యూనిట్ కరెంట్‌ని, రూ.14కు కొనుగోలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. తమ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అనేది గెలిచిన తర్వాత అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 నుంచి 85 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Spread the love