– రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది
– నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
– చర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డితో హరీశ్‌రావు ములాఖత్
నవతెలంగాణ-చర్లపల్లి
”సీఎం రేవంత్‌రెడ్డి చేసే తప్పులకు, నేరాలకు, అక్రమాలకు చిడుతలు వాయిస్తూ చెక్క భజన చేయాలా.. తమకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదు.. నన్నో, కేటీఆర్‌నో, తమ ఎమ్మెల్యేలనో అరెస్టు చేయండి.. కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదు” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. లగచర్ల దాడి కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని గురువారం చర్లపల్లి జైలులో ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. తమ భూములను ఇచ్చేది లేదని కొడంగల్ ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి వారిని ఎందుకు పిలిచి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పైగా గూండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ పగ ప్రతీకారంతో పట్నంను కుట్రపూరితంగా అరెస్టు చేయించారన్నారు. ఈ అరెస్టు ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పోలీసులు ఒక్కసారే ఫోన్ వచ్చిందని చెబుతుంటే.. కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్‌ఎస్ కుట్ర అంటున్నారన్నారు. ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో వారికి అండదండగా ఉండటం ప్రతిపక్షం బాధ్యత అని అన్నారు. మల్లన్నసాగర్‌లో రేవంత్ రెండ్రోజులు నిరసన చేపడితే తాము అడ్డుకున్నామా.. ? అని ప్రశ్నించారు. కానీ తమ నాయకుడు మధుసూదనాచారి లగచర్లకు వెళ్తే అడ్డుకున్నారని, ఆర్‌ఎస్ ప్రవీణ్, కార్తీక్‌రెడ్డి చివరికి ఎంపీ అరుణను వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో 14వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించామని.. అక్కడెందుకు ఫార్మాసిటీ కట్టరని ప్రశ్నించారు. రేవంత్ పాలన అదానీ, తమ్ముళ్లు, అల్లుళ్ల కోసమేనని, కానీ బీఆర్‌ఎస్ దళిత, గిరిజనుల పక్షాన నిలబడుతుందని అన్నారు.
ఆనాడు రేవంత్‌రెడ్డి, కోదండరామ్, దామోదర రాజనర్సింహ ప్రజల్ని రెచ్చగొట్టారని, అయినా తాము కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రశ్నించే గొంతు కేటీఆర్‌ను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించామని, నరేందర్ రెడ్డికి ఏ సంబంధం లేదని అన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తెలియదని, మెజిస్ట్రే ట్ ముందు హాజరుపరచడానికి ఒక్క నిమిషం ముందు ఒత్తిడి చేసి నరేందర్‌రెడ్డితో సంతకం చేయించారని ఆరోపించారు. నరేందర్ రెడ్డిని జైలులో పెట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ”ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద ప్రేమ ఇంతేనా రేవంత్ రెడ్డి.. బడా ఫార్మా కంపెనీల మీద, నీ అల్లుడి మీద ప్రేమ ఉంది తప్ప రైతులు, గిరిజనుల మీద లేదా” అని ప్రశ్నించారు. నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని, బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందన్నారు. తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, నిర్దోషిగా నరేందర్ రెడ్డి బయటకు రావడం ఖాయం అన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.