– సహకార రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర
– రైతులకిచ్చిన హామీని తుంగలో తొక్కి విద్యుత్ సవరణ బిల్లు
– కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్ :ఎస్కేఎం కార్మిక సంఘాల నిరసన ర్యాలీలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంధ్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వాటిని తిప్పి కొట్టాలని కార్మిక, కర్షకులకు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరాపార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ మోడీ సర్కార్ కార్పొరేట్లకు దేశసంపదను అప్పనంగా అప్పగించేందుకు వ్యవసాయ, కార్మిక రంగాలను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 13 నెలల పాటు ఢిల్లీలో వీరోచితంగా పోరాటం చేసి, 750 మంది రైతుల ఆత్మబలిదానంతో సాధించుకున్న 3 వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ సాక్షిగా రద్దు చేసారని వాపోయారు. వాటిని దొడ్డిదారిన అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో వ్యవసాయ, సహకార రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసిందని విమర్శించారు. రైతులు, రైతు సంఘాలతో చర్చించకుండా విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టబోమనే హామీని తుంగలో తొక్కిన పార్లమెంట్లో బిల్లును అమోదించిందని గుర్తు చేశారు. పెట్రోల్, డిజీల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు 35 నుంచి 50 శాతానికి పెరిగాయని విమర్శించారు. కనీస వేతనాలు అమలు చేయక పోవడం, పనికి ఆహర పథకానికి నిధులు తగ్గించడం తదితర విధానాలు పేదల పట్ల బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు మతత్వాన్ని ప్రజల నరనరాల్లో ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ఫాసిస్టు విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెలుతున్న బీజేపీ ప్రభత్వాన్ని గద్దెదింపేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. 2024లో బీజేపీ మరోసారి అధికారం చేపడితే రాజ్యాంగానికి పెను ప్రమాదమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్కేఎమ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న చేపట్టిన కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రతి పక్షాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బాలమల్లేశ్, ఎస్కేమ్ నాయకులు రాయల చంద్రశేఖర్, ఎం.వెంకన్న, జక్కుల వెంకటయ్య, బిక్షపతి, కన్నెగంటి రవి, విస్సా కిరణ్, తదితరులు పాల్గొన్నారు.