Review : ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’.. ఎలా ఉందంటే..?

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాన్‌ఇండియా స్టార్‌గా మారాక ప్రభాస్‌ నుంచి వచ్చిన ఏ సినిమాకీ రానంత హైప్‌ ‘కల్కి 2898ఏడీ’కి వచ్చింది. దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌ చేసింది రెండు సినిమాలే అయినా.. రెండూ గొప్ప సినిమాలు కావడం, ప్రతిష్టాత్మక వైజయంతీమూవీస్‌ నుంచి వస్తున్న సినిమా కావడం, నాగ్‌అశ్విన్‌ ఎంచుకున్న కథ కావడం.. అన్నింటినీ మించి అమితాబ్‌, కమల్‌ లాంటి ఆలిండియా సూపర్‌స్టార్లు ఇందులో భాగం కావడం.. ఇవన్నీ ఈ సినిమా హైప్‌కి గల కారణాలు కావచ్చు. సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా వినూత్న పద్ధతుల్ని అనుసరించారు చిత్రయూనిట్‌. దాంతో సినిమాను ఎప్పుడు థియేటర్లో ఎక్స్‌పీరియన్స్‌ చేద్దామా? అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు. ఆ ప్రభావం వసూళ్లపై తప్పనిసరిగా ఉంటుందని చెప్పొచ్చు. 600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800కోట్ల బిజినెస్‌ చేసింది. మరి అందరి అంచనాలను ‘కల్కి 2898ఏడీ’ అందుకున్నాడా? ఊహించినట్టే విజువల్‌ వండర్‌గా సినిమా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకెళ్లాలి.
క‌థేంటంటే : కురుక్షేత్రం త‌ర్వాత ఆరు వేల ఏళ్లకు మొద‌ల‌య్యే క‌థ ఇది. భూమిపై తొలి న‌గ‌రంగా పురాణాలు చెబుతున్న కాశీ, అప్ప‌టికి చివ‌రి న‌గ‌రంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వ‌ర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ (క‌మ‌ల్‌హాస‌న్‌). కాశీలో బౌంటీ ఫైట‌ర్ అయిన భైర‌వ (ప్ర‌భాస్‌) యూనిట్స్‌ని సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డిపోవాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్ త‌ల‌పెట్టిన ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైన్యం కాశీకి వ‌చ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్‌-కె కోసం గ‌ర్భ‌వ‌తుల్ని చేసి, వారి నుంచి సీరమ్ సేక‌రిస్తూ ప్ర‌యోగాలు చేప‌డుతుంటారు. అలా సుమతి (దీపికా ప‌దుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గ‌ర్భం దాలుస్తుంది. మ‌రోవైపు రేప‌టి కోసం అంటూ శంబ‌ల ప్ర‌జ‌లు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ త‌ల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ త‌ల్లి సుమ‌తి అని న‌మ్ముతారు. మ‌రి ఆమెని కాంప్లెక్స్ ప్ర‌యోగాల నుంచి ఎవ‌రు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వ‌త్థామకీ, భైర‌వ‌కీ సంబంధం ఏమిటి?సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ -కె ల‌క్ష్య‌మేమిటి?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుంచారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎక్స్‌ట్రార్డినరీగా తీర్చిదిద్దారు. అద్భుతమైన VFXతో మరో ప్రపంచంలో ఉన్న ఫీల్ వస్తుంది. యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ అదిరిపోయాయి. ఈ యాక్షన్ డ్రామాకు ఎమోషన్ యాడ్ చేస్తే మూవీ మరో స్థాయికి చేరేది. ప్రభాస్ ఎక్కువసేపు కనిపించకపోవడం కాస్త మైనస్.
హాలీవుడ్ చిత్రాలు చూస్తున్న‌ప్పుడు మ‌నం ఇలాంటి సినిమాలు తీయలేమా? ఇలా ప్ర‌పంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మ‌న క‌థలు చెప్ప‌లేమా?అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతూ ఉంటాయి. ఆ ప్ర‌య‌త్నాన్ని విజ‌య‌వంతంగా మ‌న‌దైన క‌థ‌తో చేసి చూపించారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌. క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌, లీనం చేసే క‌థ‌, బ‌ల‌మైన పాత్ర‌ల‌తో మ‌న రేప‌టి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్ర‌లు, క‌ల్పిత ప్ర‌పంచాలు ఈ సినిమాలో కనిపించిన‌ప్ప‌టికీ, వాటికి మ‌న పురాణాల్ని మేళ‌విస్తూ క‌థ చెప్పిన తీరు అబ్బుర ప‌రుస్తుంది.

Spread the love