నాలుగు నెలల్లో ట్రూజెట్‌ సేవల పునరుద్దరణ

– ఎన్‌ఎస్‌ ఎయిర్‌లైన్స్‌కు 85 శాతం వాటా
హైదరాబాద్‌ : వచ్చే మూడు, నాలుగు నెలల్లో ట్రూజెట్‌ విమాన సేవలను పునరుద్దరించనున్నట్టు ఎన్‌ఎస్‌ ఏవియేషన్‌ ఛైర్మన్‌ మహామ్మద్‌ అలీ, వైస్‌ చైర్మెన్‌ ఇషా అలీ తెలిపారు. ట్రూజెట్‌లో తాము 85 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ట్రూజెట్‌ విలువను రూ.450 కోట్లుగా లెక్కించారన్నారు. వచ్చే ఆరు నెలల్లోనే 10 విమానాలను సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. వచ్చే రెండేళ్లలో 30 ఎయిర్‌క్రాప్ట్‌లను తీసుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. ఇందుకోసం రూ.200-300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలంలో మొత్తంగా 100 ఎయిర్‌క్రాప్ట్‌లకు విస్తరించాలని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. ట్రూజెట్‌ సేవలు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాయన్నారు. తాము మానవ వనరులు, ఎయిర్‌క్రాప్ట్‌లను సమకూర్చుకున్న తర్వాత పునరుద్దరణకు డీజీసీఏకు దరఖాస్తు చేసుకోనున్నామని పేర్కొన్నారు. 100 ఎయిర్‌క్రాప్ట్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో 2,000 మందికి ఉపా ధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ట్రూజెట్‌ సేవలను తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి ఉమేష్‌ పేర్కొన్నారు.

Spread the love