– ఉద్వేగభరితంగా ఏచూరి అంతిమయాత్ర
– దేశ, విదేశీ నేతల ఘన నివాళి
– కడసారి చూపునకు కదిలిన ప్రజలు, పార్టీ శ్రేణులు
– తరలివచ్చిన విద్యార్థి, యువజన మేధోలోకం
– ఎయిమ్స్‌కు భౌతికకాయం అప్పగింత
విశిష్ఠ విప్లవానికో దిక్సూచి సీతారాం ఏచూరి. ఆయనో వర్గ, సైద్ధాంతిక, భావజాల వ్యాప్తి. అందుకే అజాతశత్రువు అంతిమయాత్రలో అందరూ భాగస్వాములయ్యారు. దేశ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నేతలు కమ్యూనిస్టు యోధుడికి అంతిమ వీడ్కోలు పలికారు. వారితో పాటు సీపీఐ(ఎం) శ్రేణులు, విద్యార్థులు, మేథావులు, మహిళలు, వృద్ధులు, సహచరులు, శ్రేయోభిలాషులు, సామాన్యులు, కుటుంబసభ్యులు కన్నీటితో నిండిన కనురెప్పలతో ఏచూరి స్ఫూర్తిని గుర్తుచేసుకొని, లాల్‌సలాం కామ్రేడ్ అంటూ కంఠాలతో గళమెత్తి, కన్నీళ్లను గొంతులోకి జార్చేశారు. నీ ఆశయాలు మాకెప్పుడూ మార్గదర్శకాలే అంటూ అంతిమయాత్రలో భాగస్వాములు అయ్యారు. కనుచూపు మేరలో అంతా జన ప్రభంజనమే. అక్కడకు వచ్చినవారు సీతారాంతో తమకున్న అనుభవాలను జ్ఞాపకాలుగా నెమరేసుకుంటూ భావోద్వేగాలకు గురయ్యారు. కామ్రేడ్…మీరు భౌతికంగా లేకున్నా, మీ విప్లవ మార్గాన్ని మేం కొనసాగిస్తామంటూ జేఎన్‌యూ విద్యార్ధులు నినదించారు. నిద్రిస్తున్నట్టే…చిరునవ్వు చెరగకుండా కనురెప్పలు మూసి, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలను నెమరేసుకుంటున్నట్టే ప్రశాంతంగా ఉన్న ఆయన భౌతికదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అనాటమీ విభాగానికి అప్పగించేసి, సైన్స్ అనే అంతిమ గమ్యాన్ని ఆశ్రయించారు. మీరే మాకు స్ఫూర్తి కామ్రేడ్.. లాల్‌సలాం అంటూ పార్టీ శ్రేణులు నివాళ్లు అర్పించాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మార్స్కిస్టు నేత, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ప్రజలు, సహచర నేతలు, మేధావులు కన్నీటి వీడ్కోలు పలికారు. సమ సమాజ నిర్మాణానికి అర్ధ శతాబ్దానికిపైగా అలుపెరగని పోరాటం చేసిన ప్రియతమ సహచరుడికి సీపీఐ(ఎం) శ్రేణులు అశ్రునయనాలతో అంజలి ఘటించారు. వామపక్ష, అభ్యుదయ రాజకీయాలపై, ఆలోచనల ప్రపంచంపై అసాధారణ వెలుగులు నింపిన జీవితం ఇప్పుడు అజరామరమైన జ్ఞాపకం. భారతదేశాన్ని సెక్యులర్‌గా ఉంచేందుకు పోరాడిన యోధుడికి ఘన వీడ్కోలు లభించింది. వేలాది మంది హాజరైన భావోద్వేగ అంతిమ యాత్ర తరువాత సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని వైద్య పరిశోధనలు, బోధనల నిమిత్తం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అనాటమీ విభాగానికి అప్పగించారు. మూడేళ్ల క్రితం, ఏచూరి తల్లి కల్పకం మృతదేహాన్ని కూడా వైద్య విద్య కోసం ఎయిమ్స్‌కు అప్పగించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సౌత్ వెస్ట్ ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసం నుంచి అంబులెన్స్‌లో భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం భారు వీర్‌సింగ్ మార్గ్‌లోని ఏకేజీ భవన్‌కు తీసుకొచ్చారు. ఏచూరి భార్య సీమా చిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డానిష్, సోదరుడు శంకర్ తదితరులు వెంటవచ్చారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఏకేజీ భవన్ ఆవరణలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్థలంలో ప్రజల సందర్శనార్థం ఉంచి, భౌతికదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాణిక్ సర్కార్, బృందాకరత్, బీవీ రాఘవులు, నీలోత్పల్ బసు, ఎమ్‌ఏ బేబి ముందున్నారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, బీహర్, రాజస్థాన్, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్ర కమిటీల ప్రతినిధులు నివాళులర్పించారు. కడసారి ఆయన్ని చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చారు. విద్యార్థులు, కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, గృహిణులు, వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఏచూరి జోహార్.. కామ్రేడ్ అమర్ రహే
” కామ్రేడ్ సీతారాం ఏచూరి అమర్ రహే”, ”లాల్ సలామ్, సలామ్ సలామ్” వంటి నినాదాలు, విప్లవ గీతాలు అక్కడి వాతావరణాన్ని ఉద్విగం చేశాయి. మధ్యాహ్నం మూడు గంటలకు సీతారాం ఏచూరి అంతిమయాత్ర ప్రారంభమైంది. గోల్‌మార్కెట్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద ప్రారంభమై గురుద్వార్, కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం, సెంట్రల్ పోస్టు ఆఫీస్ (డాక్ భవన్), పటేల్ చౌక్ మెట్రోస్టేషన్ మీదుగా జంతర్ మంతర్ రోడ్డు వరకు సాగింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన అంతిమ యాత్రలో ముందు భాగంలో రెడ్‌షర్ట్ వాలంటీర్లు ఏచూరి చిత్ర పటాలు, సీపీఐ(ఎం) జెండాలు చేబూని ముందు నడిచారు. ఆ తర్వాత ఏచూరి భౌతిక కాయంతో అంబులెన్స్…దానివెంట సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, మాణిక్ సర్కార్, బృందాకరత్, బీవీ రాఘవులు, అశోక్ ధావలే, జి. రామకృష్ణన్, ఎంఎ బేబి, విజయరాఘవన్, ఎంవి గోవిందన్ మాస్టార్ తదితరులు నడిచారు. వారి వెనుక కేంద్ర కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ప్రతినిధులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, న్యాయవాదులు నడిచారు. జంతర్ మంతర్ రోడ్డు నుంచి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ ఎస్కార్ట్‌లో అంబులెన్స్‌లో భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. సాయంత్రం 4.40 గంటలకు ఏచూరి కుటుంబ సభ్యులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు భౌతిక కాయాన్ని ఎయిమ్స్ అనాటమీ విభాగానికి అప్పగించారు. 10 నిమిషాలపాటు ఏచూరిని కడసారి చూసి, ఆ తర్వాత అందరూ హాల్ నుంచి బయటకు వచ్చారు. బృందాకరత్ తలుపు మూసివేశారు. గొప్ప విప్లవకారుడి భౌతిక కాయాన్ని వైద్య ప్రపంచం సొంతం చేసుకుంది. అంతిమ యాత్రలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, టి. సాగర్, జాన్ వెస్లీ, డిజి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, నేతలు పి. మధు, ఎస్ పుణ్యవతి, హేమలత, ఆర్. అరుణ్ కుమార్, వై. వెంకటేశ్వరరావు, వి.ఉమా మహేశ్వరరావు, వి.కృష్ణయ్య పాల్గొన్నారు.
విప్లవోద్యమం అజరామరం. లౌకిక, సామ్యవాదమే అంతిమ లక్ష్యం. దానికోసం తుదివరకు పోరాడటమే ముందున్న మార్గం – సీతారాం ఏచూరి