– ప్రభుత్వానికి రూ. 217 కోట్ల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగవేత
– దిర్శంచర్ల తిరుమల కార్పొరేషన్ రూ.107 కోట్ల బియ్యం ఎగవేత
– గరిడేపల్లిలో రూ.110 కోట్ల బియ్యం భాగోతం వెలుగులోకి..
– రెండు మిల్లుల నిర్వాహకులు తండ్రీకొడుకులే..
– సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, గరిడేపల్లిలో కేసుల నమోదు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌కు సంబంధించి భారీ కుంభకోణం బయటపడింది. రెండు మిల్లుల నుంచి ప్రభుత్వానికి అందాల్సిన రూ.217 కోట్ల బియ్యం ఎగవేత వెలుగులోకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌్, మెప్మాల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు కేటాయిస్తుంది. అయితే, కస్టమ్ మిల్లింగ్ పద్ధతి ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా బయట మార్కెట్‌లో అమ్ముకున్న వ్యవహారం బయటపడింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల మండలం దిర్సంచెర్ల మిల్లుల్లో రూ.217 కోట్ల కస్టమ్ మిల్లింగ్ బియ్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వీటి నిర్వాహకులు ఇద్దరూ తండ్రీకొడుకులు. దీనిపై కేసులు నమోదయ్యాయి.
గరిడేపల్లిలో సంతోషిమా రైస్ మిల్లు కార్పొరేషన్ యజమాని బి.వెంకటేశ్వర్లు 2022-23 ఖరీఫ్, రబీ, 2023-24 ఖరీఫ్ పంటలకు చెందిన 33వేల 938 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. దాని విలువ రూ.110 కోట్లు. నేరేడుచర్ల మండలం దిర్సంచర్ల గ్రామంలోని తిరుమల రైస్ మిల్ కార్పొరేషన్‌కు చెందిన జి.రాజేష్ 2022 -23 ఖరీఫ్, రబీ, 2023-24 ఖరీఫ్ పంటకు సంబంధించిన 32వేల 779 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. దీని విలువ రూ.107 కోట్లు. అయితే, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వాలని మూడు మాసాలుగా ఆయా రైస్ మిల్లుల యజమానులకు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ప్రసాద్ 12 సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో డీటీసీఎస్ హుజూర్‌నగర్, డీసీఎస్ తహసీల్దార్ గరిడేపల్లి, హైదరాబాద్ ఈటిఎఫ్ బృందం సంతోషిమా, తిరుమల రైస్ కార్పొరేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ నిల్వ ఉన్న ధాన్యం బస్తాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌కు తగ్గ లెక్క సరిపడలేదు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని వ్యక్తిగతంగా అమ్ముకున్నట్టు తేలింది. దీంతో అధికారులు జిల్లా కలెక్టర్ సూచన మేరకు గరిడేపల్లి, నేరేడుచర్ల మండల పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ రెండు రైస్ మిల్లుల యజమానులు వెంకటేశ్వర్లు, రాకేష్ గతంలో కూడా ఇలాంటి వ్యవహారం సూర్యాపేట జిల్లాలో బయటపడింది. ఉద్దేశపూర్వకంగా తండ్రీకొడుకులు రూ.217 కోట్లు విలువగల బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు ఆరోపణలొస్తున్నాయి.
12 నోటీసులు ఇచ్చినా స్పందించలేదు రసరఫరాల శాఖ సూర్యాపేట జిల్లా మేనేజర్ ప్రసాద్
గరిడేపల్లిలో సంతోషిమా రైస్ కార్పొరేషన్ మిల్లు యజమాని బి.వెంకటేశ్వర్లు 33వేల 938 మెట్రిక్ టన్నులు, నేరేడుచెర్ల మండలం దిర్సంచెర్ల తిరుమల రైస్ మిల్ కార్పొరేషన్ యజమాని జి.రాజేష్ 32వేల 779 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం మూడు నెలల్లో 12సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. చివరకు ఆయా రైస్ మిల్లుల్లో అధికారులతో కలిసి ఈనెల 10న తనిఖీ నిర్వహించాం. మిల్లుల యజమానులు ఒప్పందాన్ని ఉల్లంఘించి ధాన్యం నిల్వను మొత్తానికి దుర్వినియోగం చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను సకాలంలో ప్రభుత్వానికి అప్పగించడంలో విఫలమవ్వడంతోపాటు బయట అమ్ముకున్నట్టు తేలింది. పై అధికారుల సూచనతో చట్టపరమైన చర్యల కోసం పోలీసులను ఆశ్రయించాం. పెనాల్టీ, సంవత్సరానికి 12శాతం వడ్డీ సహా, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన జరిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాం.