– నేడు ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ పోరు
– ఫైనల్లో చోటు కోసం తొలి ప్రయత్నం
– మొతెరాలో హైదరాబాద్, కోల్‌కత ఢీ
ఐపీఎల్ చరిత్రలో బ్యాటింగ్ రికార్డులను ఒక్క సీజన్‌లో తిరగరాసిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. 277, 287, 266 భారీ స్కోర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. పవర్‌ప్లేలోనే 125 పరుగులు దంచికొట్టిన ప్రపంచ టీ20 క్రికెట్‌లోనే సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఆకాశమూ హద్దు కాదు అంటూ విధ్వంసం సృష్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదే స్థాయిలో పోటీ ఇవ్వగల ఏకైక జట్టు కోల్‌కత నైట్‌రైడర్స్. ఈ సీజన్లో కోల్‌కత సైతం 272, 262 భారీ స్కోర్లతో చెలరేగింది.
ఐపీఎల్ 2024 బ్యాటింగ్‌లో మేటీ జట్లు నేడు క్వాలిఫయర్ 1లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. సునీల్ నరైన్, రింకూ సింగ్, అండ్రీ రసెల్ త్రయాని కి గట్టి పంచ్ ఇచ్చేందుకు సన్‌రైజర్స్ ఫైర్ బ్రాండ్స్ ట్రావిశ్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌లు సిద్ధమవుతు న్నారు. ఊచకోతకు మారుపేరుగా నిలిచిన సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ నేడు మొతెరాలో పరుగుల సునామీకి రంగం సిద్ధం చేసుకున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫయర్ పోరు నేడు.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గ్రూప్ దశ సమరం ముగిసింది. నేడు మొతెరా వేదికగా ప్లే ఆఫ్స్ అంకానికి తెర లేవనుంది. గ్రూప్ దశ అనంతరం పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు నేడు తొలి క్వాలిఫయర్ పోరులో ఢకొీట్టనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కత నైట్‌రైడర్స్ నేడు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో తలపడిన ఈ రెండు జట్లు మళ్లీ ఇప్పుడు క్వాలిఫయర్‌లోనే కయ్యానికి దిగుతున్నాయి. విధ్వంసక బ్యాటర్లు, నిప్పులు చెరిగే పేసర్లు, మాయ చేయగల స్పిన్నర్లతో ఇటు సన్‌రైజర్స్, అటు నైట్‌రైడర్స్ శిబిరం విజయంపై దీమాగా కనిపిస్తున్నాయి. పరుగుల వరదగా భావిస్తున్న మహా పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. క్వాలిఫయర్ 1లో నెగ్గిన జట్టు నేరుగా టైటిల్ పోరుకు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు క్వాలిఫయర్ 2 రూపంలో ఫైనల్స్‌కు చేరుకునేందుకు మరో అవకాశం దక్కించుకోనుంది. ఎలిమినేటర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్న సంగతి తెలిసిందే.
సన్‌రైజర్స్‌కు ఎదురుందా? : సన్‌రైజర్స్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని నిరూపించింది పాట్ కమిన్స్ సేన. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసుకునే వ్యూహం ఆరెంజ్ ఆర్మీకి బాగా కలిసొచ్చింది. భారీ స్కోర్లు బాదటమే కాదు లక్ష్యాలను కాపాడుకోగలమని హైదరాబాద్ నిరూపించింది. గ్రూప్ దశ చివరి మ్యాచుల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగాన్ని సైతం పటిష్టం చేసుకుంది. ట్రావిశ్ హెడ్, అభిషేక్ శర్మలు ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే.. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి రూపంలో మరో హిట్టర్ టాప్ ఆర్డర్‌లో చేరాడు. నితీశ్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ తోడుగా హెన్రిచ్ క్లాసెన్ ద్వితీయార్థం ఓవర్లలో ఊచకోత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కోల్‌కతతో తొలి మ్యాచ్‌లో ట్రావిశ్ హెడ్ ఆడలేదు. ఈ మ్యాచ్‌లో హెడ్‌ను నైట్‌రైడర్స్ ఏ విధంగా అడ్డుకుంటుందో చూడాలి. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఫామ్ అందుకున్నారు. యార్కర్లు సంధిస్తూ అదరగొడుతున్నారు. నటరాజన్ స్లో బౌన్సర్‌ను సైతం అమ్ములపొదిలో చేర్చాడు. పాట్ కమిన్స్ మిడిల్ ఓవర్లలో స్పిన్ ద్వయంతో కలిసి బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. మూడు రంగాల్లోనూ దీటుగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అడ్డుకోవటం కోల్‌కత నైట్‌రైడర్స్‌కు శక్తికి మించిన పనే!.
కోల్‌కత దూకుడు : శ్రేయస్ సారథ్యం, గంభీర్ వ్యూహ చతురత ఈ సీజన్‌లో నైట్‌రైడర్స్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది. గ్రూప్ దశలో 12 మ్యాచుల్లోనే నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించింది. ఆ జట్టు ఆడాల్సిన గ్రూప్ దశ చివరి రెండు మ్యాచులు వర్షార్పణం కావటం కాస్త ప్రతికూలం. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ తర్వాత కోల్‌కత మళ్లీ ఆడలేదు. పది రోజుల విరామం తర్వాత క్వాలిఫయర్ 1 పోరుకు రానుండటం అయ్యర్ సేనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ సేవలు కోల్పోయి నా.. సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్లో రింకూ సింగ్ తనదైన మెరుపు లు చూపించలేదు. ప్లే ఆఫ్స్‌లో అతడు విజృంభిస్తే సన్‌రైజర్స్‌కు కష్టాలు తప్పవు. అండ్రీ రసెల్‌ను కట్టడి చేయటంపై సన్‌రైజర్స్ బౌలర్లు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. కోల్‌కత బౌలింగ్‌లో స్పిన్నర్లు మినహా పేసర్లు సన్‌రైజర్స్‌కు దీటుగా లేదు.
స్పిన్ ఫ్యాక్టర్ : నేడు మొతెరాలో ఏ పిచ్ ఎదురైనా స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. కోల్‌కతకు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఇద్దరు నాణ్యమైన మాయగాళ్లు ఉన్నారు. సన్‌రైజర్స్ శిబిరంలో శ్రీలంక మాయగాడు విజయకాంత్ గత రెండు మ్యాచుల్లో మెప్పించాడు. షాబాజ్ అహ్మద్‌తో కలిసి స్పిన్ బాధ్యతలు చూస్తున్నాడు. పేస్ విభాగంలో పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ త్రయం.. మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, అనుకూల్ రారు కంటే మెరుగ్గా కనిపిస్తుండగా… స్పిన్ విభాగంలో నైట్‌రైడర్స్ పైచేయి సుస్పష్టం!.
పిచ్ రిపోర్టు
మొతెరా స్టేడియంలో రెండు రకాల పిచ్‌లు ఉన్నాయి. బ్యాటర్ల స్వర్గధామం ఎర్ర మట్టితో చేసిన పిచ్. స్పిన్నర్ల మాయాలోకం నల్లమట్టితో తయారు చేసిన పిచ్. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల నిర్వహణ, పిచ్‌ల ఎంపిక నేరుగా బీసీసీఐ పర్యవేక్షిస్తుంది. దీంతో పరుగుల వరద పారే ఎర్రమట్టి పిచ్‌ను ఎంచుకునే అవకాశం ఎక్కువ. సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ బ్యాటింగ్ పిచ్‌నే కోరుకుంటున్నాయి. క్వాలిఫయర్ 1 పోరుకు వర్షం సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిశ్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, టి నటరాజన్. కోల్‌కత నైట్‌రైడర్స్ : సునీల్ నరైన్,గుర్బాజ్ (వికెట్ కీపర్), శ్రేయస్ (కెప్టెన్), వెంకటేశ్, నితీశ్ రానా, రింకూ సింగ్, అండ్రీ రసెల్, రమణ్‌దీప్, మిచెల్ స్టార్క్, అనుకూల్ రారు, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.