అగ్నివీర్‌ పరీక్షలోనూ రిగ్గింగే !

Rigging in Agniveer's exam!– తక్కువ మార్కులొస్తే పాస్‌…ఎక్కువొస్తే ఫెయిల్‌
– కటాఫ్‌ కంటే తక్కువొచ్చినా ఎంపిక
– పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం సృష్టించిన ఆర్మీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ నియామక పరీక్షల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్‌ పథకంపై కూడా వివాదం చెలరేగుతోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో 2022 సెప్టెంబర్‌-నవంబర్‌లో జరిగిన అగ్నివీర్‌ల నియామక పరీక్షలో కూడా రిగ్గింగ్‌ జరిగిందని అభ్యర్థులు ఆరోపించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాలో చోటు సంపాదించిన ఓ అభ్యర్థి కంటే తమకు ఎక్కువ మార్కులే వచ్చాయని, అయినప్పటికీ తాము ఎంపిక కాలేదని వారు తెలిపారు.
ఎంపిక కాని అభ్యర్థుల్లో సాత్నాకు చెందిన అమన్‌ ద్వివేది ఒకరు. ఆయన 2022 డిసెంబరులో రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈ నెల 1న స్పందించింది. జబల్పూర్‌లో అగ్నివీర్‌ నియామకం సందర్భంగా ఎంపికైన అభ్యర్థులందరి మార్కులను పక్షం రోజుల్లో పిటిషనర్లకు అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతకుముందు మార్కులను బహిర్గతం చేసేందుకు సైన్యం నిరాకరించింది. ఈ వ్యవహారంపై ‘ది వైర్‌’ హిందీ పోర్టల్‌ ప్రత్యేక పరిశోధన చేపట్టింది.
అక్కడ అలా…ఇక్కడ ఇలా
వైద్య పరీక్షలో ఫెయిల్‌ అయిన నెలన్నర రోజుల తర్వాత నితీష్‌కు ఆర్మీ నియామకాల కేంద్రం నుండి ఓ ఆర్‌టీఐ సమాధానం వచ్చింది. ‘నితీష్‌ పాసయ్యాడు కానీ మెరిట్‌ జాబితాలో స్థానం దక్కలేదు’ అన్నది దాని సారాంశం. అయితే సైన్యం విడుదల చేసిన జాబితా (అదే మెరిట్‌ జాబితా) ప్రకారం ఎంపికైన అభ్యర్థుల్లో ఆయన కూడా ఒకరు. ఆర్మీ వెబ్‌సైటులో అందుబాటులో ఉన్న పరీక్షా ఫలితాలను పరిశీలిస్తే నితీష్‌ను ఇప్పటికీ ఎంపికైన అభ్యర్థిగా చూపుతున్నారు. సైనికాధికారులు ఇలా పరస్పర విరుద్ధంగా ఎలా వ్యవహరించారో అర్థం కావడం లేదు. ఆర్‌టీఐ సమాధానం చూసిన తర్వాత తన అనుమానాలన్నీ నిజమేనని తేలిందని, అగ్నివీర్‌ల ఎంపికలో రిగ్గింగ్‌ జరిగిందని తేలిపోయిందని విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చిన గౌతమ్‌ తెలిపారు. ‘నా విద్యార్థుల్లో చాలా మందికి 160-167 మధ్య మార్కులు వచ్చాయి. వీరిలో ఏ ఒక్కరి పేరు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో లేదు. కానీ 159 మార్కులు వచ్చిన నితీష్‌ పేరు జాబితాలో ఎలా ఉంది?’ అని ఆయన ప్రశ్నించారు.
కటాఫ్‌ మార్కుల కంటే తక్కువ వచ్చినా…
జబల్పూర్‌లో 2022 సెప్టెంబరులో ఫిజికల్‌ టెస్ట్‌, నవంబర్‌ 13న రాత పరీక్ష నిర్వహించారు. నవంబర్‌ 26న ఫలితాలు ప్రకటించారు. వీటిపై అసంతృప్తి వ్యక్తం చేసిన పలువురు అభ్యర్థులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో పాటు ఆర్‌టీఐ కింద దరఖాస్తు కూడా చేశారు.
ఆర్‌టీఐ కింద అందిన సమాధానం ప్రకారం నితీష్‌ కుమార్‌ తివారీకి రెండు పరీక్షల్లో కలిపి 159 మార్కులు వచ్చాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఇక్కడే పలువురు అవాక్కయ్యారు.
ఎందుకంటే మరో అభ్యర్థి దాఖలు చేసిన ఆర్‌టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం ప్రకారం అభ్యర్థుల ఎంపికకు సైన్యం 169 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. కాగా ఫలితాలు ప్రకటించిన నెల రోజుల తర్వాత వైద్య పరీక్ష నిర్వహించగా నితీష్‌ అందులో ఫెయిల్‌ అయ్యారు. దీంతో ఆయన సైన్యంలో చేరలేదు.
తప్పు తెలుసుకొని…
ఆర్‌టీఐ సమాధానం ప్రకారం నితీష్‌ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన సుజిత్‌ కుమార్‌ రావత్‌ (160.5), వికాస్‌ సింగ్‌ (163), అభిషేక్‌ వర్మ (165.5), సచిన్‌ సింగ్‌ (166.5), సౌరబ్‌ సింగ్‌ (167) ఫెయిలయ్యారు. పరీక్షా ఫలితాలపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానంలో పిటిషన్లు వేయడంతో నితీష్‌ పేరును జాబితా నుండి తొలగించారని గౌతమ్‌ ఆరోపించారు. నితీష్‌ పేరును జాబితాలో ఉంచితే తమకు సమస్యలు తప్పవని సైనికాధికారులు గ్రహించారని, అందుకే చివరి నిమిషంలో అతని పేరును తొలగించారని తెలిపారు. కాగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో స్థానం దక్కని పలువురు అభ్యర్థులు తొలుత మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో వారు సాయుధ దళాల ట్రిబ్యునల్‌కు వెళ్లారు. అక్కడా నిరాశ ఎదురైంది. చివరికి మళ్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు.

Spread the love