నియామక పరీక్షలో రిగ్గింగ్‌

Rigging in recruitment examination– పత్తా లేని సిబ్బంది
– దొంగ చేతికే తాళం ఇచ్చిన కేంద్ర సంస్థ నిర్వాహకులకు బీజేపీతో సంబంధాలు
– ప్రధాని నేతృత్వంలోని సీఎస్‌ఐఆర్‌పై తాజా ఆరోపణలు
– భారీగా అవకతవకలు కేంద్రాల్లో ఇతరుల హల్‌చల్‌
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నేతృత్వంలోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్టియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)లో సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఓ), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌ఓ) ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌, అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల కోసం జరిపిన పరీక్షల తొలి దశపై వివిధ రాష్ట్రాల్లో పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. అయితే ఈ నెల 7న దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నిర్వహించిన రెండో దశ పరీక్షలో కూడా అవకతవకలు, నిర్వహణ లోపం చోటుచేసుకున్నాయని తాజాగా ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అనేక పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకొని వెళ్లారని, బహిరంగంగా వీడియోలు తీశారని ‘ది వైర్‌’ హిందీ పోర్టల్‌ పరిశోధన జయటపెట్టింది. పరీక్షా కేంద్రాల్లో పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయి. కలకలం చెలరేగింది. కేంద్రాల్లోకి ఇతరులు కూడా ప్రవేశించి హల్‌చల్‌ చేశారు. పరీక్ష నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని దీనిని బట్టి అర్థమవుతోంది. కొన్ని చోట్ల సూపర్‌వైజర్లు, ఇతర ఉద్యోగుల జాడే కన్పించలేదు. సోషల్‌ మీడియాలో కన్పించిన దృశ్యాలు, వీడియోలను చూస్తుంటే అది ఓ ప్రముఖ ప్రభుత్వ సంస్థ నిర్వహించిన నియామక పరీక్ష మాదిరిగా కన్పించలేదు.
యూపీ బ్లాక్‌లిస్టులో పెట్టినా…
కొన్ని చోట్ల పరిస్థితి చేయి దాటి పోవడంతో పోలీసులను పిలవాల్సి వచ్చింది. నియామక పరీక్షలో అవకతవకలేవీ జరగలేదని అప్పటి వరకూ వాదిస్తూ వచ్చిన సీఎస్‌ఐఆర్‌ కూడా రెండో దశ తర్వాత నోటీసు జారీ చేసింది. సాంకేతిక సమస్యలపై ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించిన తర్వాత అభ్యర్థులకు వెబ్‌ నోటీసు ద్వారా నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పింది. ఈ పరీక్షను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ కంపెనీ నిర్వహించిందని, దానిని ఇప్పటికే యూపీ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిందన్న విషయాన్ని సీఎస్‌ఐఆర్‌ విస్మరించింది. తొలి దశ పరీక్షలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ అదే కంపెనీ ఆధ్వర్యంలో రెండో దశ పరీక్షను నిర్వహించడం దొంగ చేతికే తాళం అప్పగించినట్లు ఉన్నదని అభ్యర్థులు ఆరోపించారు.
పరీక్ష నిర్వహణ ఇలా…
దేశంలోని ఢిల్లీ, చండీఘర్‌, కొల్‌కతా, లక్నో, పూనే, భోపాల్‌, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నరు, గౌహతి నగరాల్లోని 33 కేంద్రాల్లో ఈ నెల 7న రెండో దశ పరీక్ష జరిగింది. దీనిని రెండు షిఫ్టులుగా (లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాల్సిన పరీక్ష, కంప్యూటర్‌ నైపుణ్య పరీక్ష) నిర్వహించారు. రాజధాని ఢిల్లీలోని ఓ పరీక్షా కేంద్రంలో మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 11.40కి మొదలైంది. దీనిపై కొందరు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసి బయటికి వెళ్లిపోవాలని ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. రెండో షిఫ్టు పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కావాల్సి ఉండగా గంట ఆలస్యమైంది. పరీక్ష సమయంలో అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సమయం పూర్తయినప్పటికీ కొందరు వ్యక్తులు ఓ మహిళా అభ్యర్థికి సాయం చేయడం కన్పించింది. సమయానికి పరీక్ష ప్రారంభం కాకపోవడానికి నీదంటే నీదే కారణమని కేంద్రం యజమాని, సీఎస్‌ఐఆర్‌ సిబ్బంది పరస్పరం నిందించుకున్నారు. కొందరు సిబ్బంది తమకు తెలిసిన అభ్యర్థులతో సంప్రదింపులు జరిపారు. ఇదేమిటని ప్రశ్నిస్తే జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. అనేక పరీక్షా కేంద్రాల్లో ఇలాంటి దృశ్యాలే కన్పించాయి. పరీక్షకు ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ భద్రమైనది కాదని అభ్యర్థులు తెలిపారు. పరీక్ష కోసం వాడిన కంప్యూటర్‌లో పెన్‌డ్రైవ్‌ పెట్టి మోసం చేయడం తేలిక అని చెప్పారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లోకి సమయం దాటినప్పటికీ అభ్యర్థులను అనుమతించారు.
వ్యవస్థాపకుడికి బీజేపీతో సంబంధాలు
గుజరాత్‌ కంపెనీ ఎడుటెస్ట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీజేపీ మధ్య ఉన్న సంబంధాలపై ది వైర్‌ హిందీ పోర్టల్‌ ఆరా తీసింది. ఎడుటెస్ట్‌ వ్యవస్థాపకుడు సురేష్‌ చంద్ర ఆర్య ఓ హిందూ సంస్థ అధ్యక్షుడు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని మోడీ తరచుగా హాజరవుతుంటారు. ఈ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినీత్‌ ఆర్య పేపర్‌ లీకేజీ కేసులో జైలుకు వెళ్లారు. అయినప్పటికీ ఆ కంపెనీ బీజేపీ ప్రభుత్వాల నుండి పరీక్షల నిర్వహణ కాంట్రాక్టులు సంపాదిస్తోంది. తొలి దశ పరీక్షలో అవకతవకలపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. చీటింగ్‌ ఆరోపణలపై జైళ్లలో ఉన్న కొందరు అభ్యర్థుల పేర్లు పరీక్ష పాసైన వారి జాబితాలో ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంపై ప్రస్తుతం క్యాట్‌ విచారణ జరుపుతోంది.

Spread the love