సరైన నిర్ణయం

ఎప్పుడూ తన మాటకి అడ్డు చెప్పని అమ్మ, ఈ రోజు అలా ఖరాఖండిగా ‘వద్దు’ అని చెప్పేసరికి చంద్రిక తట్టుకోలేకపోయింది. వెంటనే మరే వివరాలు మాట్లాడకుండానే ఆవేశంగా ఫోన్‌ పెట్టేసింది.
శరత్‌, తను, పాప. ముచ్చటైన కుటుంబం. పాప రెండవ తరగతి. శరత్‌ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత తను కూడా ఖాళీగా ఉండటం ఎందుకని ఈ మధ్యనే పాప చదివే ప్రైవేట్‌ స్కూల్‌ లో టీచర్‌ గా జాయిన్‌ అయింది. ఉదయాన్నే ముగ్గురూ హడావుడిగా పనులు చేసుకుని వెళ్ళడం, సాయంత్రం చక్కగా ముచ్చట్లతో కలిసి భోజనం చేయడం.. శని, ఆదివారాల్లో సరదాగా బయటికి వెళ్లడం. ఇలా జీవితం హాయిగా గడిచిపోతోంది.
అయితే ఒక నెల క్రితం శరత్‌ అమ్మగారికి ఆరోగ్యం బాగోకపోతే తల్లిదండ్రులిద్దర్నీ ఇంటికి తీసుకు వచ్చాడు. అప్పటినుంచి అత్తమామల ఇద్దరికీ సేవలు చేయటం చంద్రికకు అదనపు భారం అయ్యింది. ఏదో ఒకరు అయితే సర్దుకోవచ్చు. మరీ ఇద్దరు అయ్యేసరికి తనకు పని భారం ఎక్కువ అవుతోందని ‘ఒకరిని మీ అన్నయ్య దగ్గరికి పంపిద్దాం’ అని శరత్‌ కు చెప్పాలనుకుంది. ఇదే విషయాన్ని ఉదయం తల్లితో చర్చిస్తే తల్లి వద్దని చెప్పేసరికి తను మరేం మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేసింది. అలా పెట్టేసినందుకు కాస్త బాధపడింది కూడా. అమ్మ తన ఇబ్బందిని తెలుసుకోవడం లేదు. తన పరిస్థితి అర్ధమయ్యేలా మరోసారి చెప్పాలి అనుకుంది మనసు కుదుటపడ్డాక.
సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన శరత్‌ ”చంద్రికా! నాకు రెండు రోజులు ఢిల్లీ వెళ్లే పని ఉన్నది. కాస్త ఈ రెండు రోజులు సెలవు పెట్టి నువ్వే దగ్గర ఉండి అమ్మానాన్నలను చూసుకోవాలి” అని చెప్పాడు.
”అబ్బా! మళ్లీ రెండు రోజులా? కిందటి నెలే కదండి మీరు వెళ్లారు. ఈసారికి మరెవరినన్నా పంపించ మనకూడదూ” అంది కాస్త విసుగ్గా.
”అదికాదోరు.. ఆ ప్రాజెక్టు మీద ఎక్కువగా వర్క్‌ చేసిన వాడిని నేనే. అందుకనే నన్నే పంపిస్తున్నారు మా ఆఫీసర్‌. వారి మాట కాదనలేం కదా!?” అని సముదాయించాడు శరత్‌.
ఇంటి పనులలో ఎక్కువ సాయం చేయకపోయినా, శరత్‌ ఉంటే అదొక ధైర్యం తనకు. ఇక ఏమి చేయలేక శరత్‌ ప్రయాణానికి అవసరమైనవన్నీ సిద్ధం చేసే పనిలో పడింది చంద్రిక.
మరుసటిరోజు ఉదయాన్నే శరత్‌ ఊరు బయలుదేరాక టిఫిన్లు పూర్తి చేసి, భోజనాలకు అన్నీ సిద్ధం చేసేసరికి 11:30 అయింది. చక్కని సువాసనతో దప్పళం ఎంతో బాగా కుదిరింది. వెంటనే అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చేసే దప్పడం అంటే తనకు ఎంతో ఇష్టం. పోయినసారి ఇంటికి వెళ్ళినప్పుడు పట్టు పట్టి వండడం నేర్చుకుంది. అమ్మతోపాటు నిన్నటి విషయం కూడా గుర్తొచ్చింది చంద్రికకు.
అందుకే మరి ఇక ఆగలేక తల్లికి ఫోన్‌ చేసింది. ”నా ఇబ్బందిని నువ్వు అస్సలు గుర్తించడం లేదు” అంటూ మొదలుపెట్టి తన గోడునంతా వెళ్ళ బోసుకుంది.
అమ్మ అంతా మౌనంగా విన్నది.
”చూడు చంద్రికా.. నాకూ, మీ నాన్నగారికి పెళ్ళయిన రెండేళ్ళకు మీ పెద్దన్నయ్య పుట్టాడు. ఆ తరువాత రెండేళ్లకి చిన్నన్నయ్య. మరుసటి ఏడుకే నువ్వు పుట్టావు. మీ ముగ్గురిని సాకే క్రమంలో మేమిద్దరం ఎప్పుడూ మాకు మేముగా ఉండలేకపోయాం. మీ చదువులు, పెళ్లిళ్లు, మనవళ్ళు అందరూ సెటిల్‌ అయ్యి, మీ నాన్న రిటైర్మెంట్‌ తర్వాత ఇక మేమిద్దరం ఒకరికొకరు తోడుగా… కలిసి ఉండొచ్చని అనుకున్నాం. కానీ అదే సమయంలో మీ వదినకు ఆరోగ్యం బాగోని కారణంగా నేను పెద్దన్నయ్య దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది. నాన్నను చిన్నన్నయ్య తీసుకెళ్ళాడు. ఏమీ చెప్పలేని పరిస్థితి అయిపోయింది మాకు. అప్పుడప్పుడు ఫోన్‌లలో మాట్లాడుకోవడం, ఎప్పుడో పండక్కో, పబ్బానికో ఎదురు పడటం జరిగేది. ఒంటరితనాన్ని భరించలేక మీ నాన్నగారు వెళ్లిపోయారు. ఆరోజు మాకు ఏర్పడిన పరిస్థితి మీ అత్తమామలకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఎంత బాధాకరమో నేను అనుభవించాను కాబట్టి. అంతెందుకు? శరత్‌ రెండు రోజులు టూర్‌కి వెళ్తే తను వచ్చేదాకా నువ్వు ఎంతగా ఎదురు చూస్తావు. అలాంటప్పుడు అంతకాలం ఒకరికొకరు తోడుగా ఉన్న భార్యాభర్తలను వృద్ధాప్యంలో విడదీయడం సరైనదేనా? ఒక్కసారి ఆలోచించు” అని తల్లి ఫోన్‌ పెట్టేసింది.
అనాలోచితంగా ఎంత పెద్ద పొరపాటు చేయబోయింది తను? అమ్మ, నాన్న బాధను తను కూడా అర్థం చేసుకోలేదు. మనసు బాధతో మూలిగింది. అ బాధలోనే తన తప్పుడు నిర్ణయాన్ని సమాధి చేసి తన ఆలోచనను సరిచేసిన అమ్మకు మనస్సులోనే కతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రశాంతమైన వదనంతో అత్తమామలకు భోజనం వడ్డించటానికి డైనింగ్‌ హాల్లోకి కదిలింది చంద్రిక.
– విశ్వైక, 9550183143

Spread the love