రైట్‌..రైట్‌

– అర్థరాత్రి కారు దిగి ట్రక్కులో ప్రయాణించిన రాహుల్‌
– డ్రైవర్ల మన్‌కీబాత్‌ విన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత
చంఢగీఢ్‌: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తర్వాత జనంలోకి వెళ్లటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కర్నాటక ఎన్నికలపుడు స్థానిక రెస్టారెంట్లకు వెళ్లి..అక్కడ టిఫిన్‌ తిన్నారు. అంతకుముందు ఢిల్లీ యూనివర్సిటీ హస్టల్‌ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తాజాగా సోమవారం అర్థరాత్రి అతను కారు దిగి ట్రక్కులో ప్రయాణించారు. రాహుల్‌ కారు ఆపి..తన లారీలోకి ఎక్కటంతో..ఆ వాహనచోదకుడు ఆశ్చర్యపోయాడు. లారీలో కొద్దిదూరం ప్రయాణించాక..ఓ డాబా వద్ద లారీని ఆపి.. అక్కడ ఉన్న ట్రక్కు డ్రైవర్ల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌ ప్రయాణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
సిమ్లాలోని తన సోదరి ప్రియాంక ఇంటికి రాహుల్‌ వెళుతుండగా.. ఢిల్లీ- చంఢగీఢ్‌ జాతీయ రహదారిపై ట్రక్కు లో ఎక్కి ప్రయాణించారు. హర్యానా లోని ముర్తాల్‌ నుంచి అంబాలా వరకు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్‌… డ్రైవర్ల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘దేశవ్యాప్తంగా 90 లక్షల మంది లారీ డ్రైవర్లు ఉన్నారు. వారి మన్‌కీ బాత్‌ను రాహుల్‌ గాంధీ విన్నారు’ అని కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. ఇక నెట్టింట్లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ‘మీరు అతనిని పార్లమెంటు నుంచి అనర్హులు గా ప్రకటించవచ్చు. కానీ ప్రజల హృదయాల నుంచి రాహుల్‌ ను ఎన్నటికీ అనర్హులుగా చేయలేరు’ అని ట్విట్టర్‌ యూజర్‌ రాసుకొచ్చారు.

Spread the love