– ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన తాజా టెస్ట్ బ్యాటర్ల జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సత్తా చాటాడు. ఐసిసి బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రిషభ్ పంత్ టాప్-10లో చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో రాణించిన పంత్.. ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 739 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. సిడ్నీ టెస్టులో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 40, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. ఐసిసి తాజాగా వెల్లడించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఎలాంటి మార్పులు లేవు. జో రూట్, హ్యారీ బ్రూక్, కేన్ విలియమ్సన్, యశస్వి జైస్వాల్, ట్రావిస్ హెడ్ వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపరచుకొని ఆరో ర్యాంకులో నిలిచాడు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ ఐదు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ మూడేసి స్థానాలు పడిపోయి 23వ, 27వ ర్యాంకులకు పరిమితమయ్యారు. ఆసీస్‌తో చివరి టెస్టుకు దూరంగా రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి 42వ ర్యాంకులో ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా 29 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి దూసుకొచ్చాడు. 745 పాయింట్లతో రవీంద్ర జడేజాతో కలిసి బోలాండ్ 9వ స్థానాన్ని పంచుకున్నాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్టులో బోలాండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు, జస్‌ప్రీత్ బుమ్రా భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. గత వారం 907 పాయింట్లతో ఉన్న బుమ్రా ఈ వారం ఒక పాయింట్ మెరుగుపర్చుకుని టాప్‌లోనే కొనసాగుతున్నాడు. 2016లో అశ్విన్ 904 రేటింగ్ పాయింట్లు సాధించగా.. బుమ్రా దాన్ని గత వారం అధిగమించిన విషయం సంగతి తెలిసిందే.
సిడ్నీ పిచ్‌కు ఐసిసి రేటింగ్.. :
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా జరిగిన ఐదు టెస్ట్ మైదానాల రేటింగ్స్‌నూ ఐసిసి ప్రకటించింది. పెర్త్, అడిలైడ్ ఓవల్, గబ్బా, మెల్‌బోర్న్ పిచ్‌లకు ‘వెరీ గుడ్’ అని, సిడ్నీ పిచ్‌కు ‘సంతప్తికరం’ అనే రేటింగ్ ఇచ్చింది. ఇంతకుముందు పిచ్ రేటింగ్ విధానం ఆరు కేటగిరీలుగా ఉండేది. 2023లో దీన్ని నాలుగుకు (వెరీ గుడ్, సంతప్తికరం, అసంతప్తికరం, అన్‌ఫిట్) కుదించిన సంగతి తెలిసిందే.