– సన్న రకం క్వింటాలు రూ.5,300 పైనే
– రెండు వారాల్లో రూ.200 పెరుగుదల
కృష్ణా : మార్కెట్లో బియ్యం ధర చూస్తే గుండె గుభిల్లుమంటోంది. సన్న బియ్యం ధర వారం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగి క్వింటాలు ధర రూ.5,300కు చేరింది. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం మార్కెట్లో అవసరమైన స్థాయిలో అందుబాటులో లేకపోవడం, వరదలు, భారీ వర్షాలకు వరి పంటకు నష్టం వాటిల్లిందనే సాకుతో హోల్‌సేల్ మార్కెట్లో ధరలు పెంచారని చిల్లర వర్తకులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలులేని అన్ సీజన్లోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా బియ్యం ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మేలో కిలో బిపిటి బియ్యం రూ.45, ఆర్‌ఎన్‌ఆర్ రూ.46, హెచ్‌ఎంటి రూ.54లకు విక్రయించారు. మేతో పోలిస్తే బిపిటి, ఆర్‌ఎన్‌ఆర్ బియ్యం కిలో రూ.7, హెచ్‌ఎంటి రూ.14 పెరిగింది. సెప్టెంబర్ ఒకటో తేదీన బిపిటి 5204 (కర్నూలు సోనా, సాంబ మసూరి) క్వింటాలు బియ్యం ధర మార్కెట్లో రూ.5,100 ఉంది. ఏడో తేదీకి రూ.5,200కు, 15వ తేదీకి రూ.5,300కు చేరింది. ఆర్‌ఎన్‌ఆర్ రూ.5,300 నుంచి రూ.5,500కు పెరిగింది. హెచ్‌ఎంటి బియ్యాన్ని ఆగస్టు మొదటి వారంలో రిటైల్‌గా రూ.6,200కు విక్రయించారు. తాజాగా రూ.6,800 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడం ద్వారా వ్యాపారులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. పెరిగిన ధర రైతులకు దక్కడం లేదు. గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. ఆకాశాన్ని అంటుతున్న ధరల వల్ల వినియోగదారులపై మోయలేని భారం పడుతోంది. కేంద్రప్రభుత్వం 25 కిలోలలోపు బియ్యం సంచులపై జిఎస్‌టి విధించింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఎక్కువగా 26 కిలోల బస్తాలను విక్రయిస్తున్నారు. చిన్న కుటుంబాలు గాయత్రి, లలిత తదితర కంపెనీల పది కిలోల సంచులకు కొనుగోలు చేస్తున్నాయి. అదనంగా రూ.35 జిఎస్‌టి చెల్లించాల్సి వస్తోంది.
కుటుంబాలపై భారం
కృష్ణా జిల్లాలో సగటున 3.50 లక్షల కుటుంబాలు సన్నబియ్యం వినియోగిస్తున్నాయి. రేషన్ దుకాణాల్లో ఇస్తున్న బియ్యాన్ని కొందరు దోసెలు, బియ్యపు పిండి వంటకాలకు వినియో గిస్తున్నారు. చుట్టాలొచ్చినప్పుడు లేదా పండగలు పబ్బాలు, ఫంక్షన్లకు మాత్రమే సన్నబియ్యాన్ని సామాన్యులు వాడుతుంటారు. వాటి ధరలు వీరికి అందుబాటులో లేవు. సెప్టెంబర్ మొదటి వారంతో పోలిస్తే పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ.1.80 కోట్ల భారం అదనంగా పడింది.
బిపిటి ధాన్యానికి డిమాండ్
కృష్ణా జిల్లా కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు తదితర మండలాల్లో బిపిటి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో బిపిటిలను సేకరించడానికి అవకాశం కల్పించలేదు. ఈ తరహా ధాన్యానికి మద్దతు ధర కన్నా ఎక్కువగా ధర పలుకుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు పంట పెట్టుబడి అవసరాలకు ఏప్రిల్, మేల్లో ఎక్కువమంది రైతులు బిపిటి ధాన్యం విక్రయించుకుంటారు. 75 కిలోల బస్తాను వ్యాపారులు సగటున రూ.1800కు కొనుగోలు చేశారు. మార్కెట్ యార్డు గొడౌన్లలో వ్యాపారులు లారీల కొద్దీ నిల్వ ఉంచారు. బిపిటి ధాన్యం నిల్వలు రైతుల దగ్గర పెద్దగా లేవు. తాజాగా బస్తా రూ.2,300కు ధర చేరుకుంది. రైతులకు ఒక్కో బస్తాపై సగటున రూ.500 వరకు నష్టపోయారు.