– ఆయిల్ ఫామ్ సాగులో తీసుకోవలసిన జాగ్రతలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్ట్యా ఆయిల్ ఫాం సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,యాజమాన్య పద్దతులు పై ఉద్యాన శాఖ,ఆయిల్ ఫెడ్ అధికారులు సందీప్,బాలక్రిష్ణలు రైతులకు పలు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో, సాగునీటి వసతి తో రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 45 వేల ఎకరాలలో తోటలు కాత దశలో ఉన్నాయి. సుమారు 1.5 లక్షల ఎకరాలలో లేత తోటలు ఉన్నాయి.మంచి యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులు, పది సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ పంట నుండి సాలీనా ఎకరాకు సరా సరి 10 – 12 టన్నుల గెలలు దిగుబడి సాధిస్తున్నారు. వేసవి కాలంలో అనగా ఏప్రిల్, మే మాసాల్లో ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని, కొత్తగా వేసిన లేత ఆయిల్ పామ్ ఎదిగిన ఆయిల్ పామ్ పంట పెరుగుదలను కాపాడుకుంటూ, మంచి దిగుబడి సాధించేందుకు దిగువ సూచించిన యాజమాన్య పద్దతులను రైతులు పాటించాలి.
1)ఒకటి నుండి మూడు సంవత్సరముల వయస్సు గల ఆయిల్ పామ్ తోటలలో, మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుము ను పచ్చి రొట్టఎరువు పంటగా నాటుకోవాలి.జనుము పూత కు వచ్చిన వెను వెంటనే చిన్న చిన్న ముక్కలుగా కోసి పాదు లో చుట్టూ వేయాలి.
2)ప్రతి ఆయిల్ పామ్ మొక్కకు ఇరువైపులా ఒక్కో మైక్రో జెట్ (30 లీటర్లు లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి.వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150 – 165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరు పక్కల ఒక్కో జెట్ కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉన్నట్లయితే, రోజుకు 2 గంటలు నీరు అందివ్వాలి.ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో వేసవి కాలంలో ప్రతి చెట్టుకు రోజుకు 250 నుంచి 330 లీటర్ల నీటిని అందించాలి.
4)మూడేళ్ళ లోపు వయసున్న ఆయిల్ పామ్ మొక్కల్లో ని పూ గుత్తులు ను ప్రతి నెల అబ్జెషన్ సాధనం తో (రెండు సార్లు) తొలగించాలి.
5)అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను మాత్రమే తొలగించాలి. చెలుపు లేదా వృధాగా పచ్చి ఆకులను నరక రాదు.
6)ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటలు వేసి నట్లయితే,ఆయిల్ పామ్ తో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి.
7)ఆయిల్ పామ్ రైతులు,రైతు డైరీలు లో సిఫారసు చేసిన పద్ధతిలో పోషకాలను తప్పనిసరిగా అందించి అట్టి వివరాలను రైతు డైరీలు లో నమోదు చేయాలి.
8)ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో గెలలు కోసిన తరువాత,నరికి ముక్కలు చేసిన ఆయిల్ పామ్ ఆకులను,మగ పూల గుత్తులు ను,మొక్కజొన్న చొప్పను మరియు ఖాళీ ఆయిల్ సామ్ గెలలు ను, పాదు ల్లో మల్చింగ్ గా పరచాలి.
ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెల ను, అల్యూమినియం కడ్డీని లేదా కత్తిని ఉపయోగించి కోయాలి.
ఎదిగిన ఆయిల్ పామ్ తోటలకు,నెలకు ఎకరాకు 5 కేజీల యూరియా,3 కేజీల డిఎస్,5 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్,2.5 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ ను,ఒక కేజి బొరాక్స్ ను విడి విడి గా, నీటిలో కరిగించి ఫెర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వలన సమయం మరియు ఎరువులపై ఖర్చు కూడా ఆదా చేయవచ్చు.
11)ఆయిల్ పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపించి నట్లైతే మట్టి మరియు పత్ర విశ్లేషణ కొరకు నమూనాలు (క్రితం పంప నట్లయితే) సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కొరకు పంపాలి.
12)ఆయిల్ పామ్ కంపెనీలు, జిల్లా ఉద్యాన అధికారులు ఇట్టి సమాచారాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు రైతుల వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా రైతులకు చేర వేయాలి.
ఆయిల్ ఫామ్ పంట గురించి ఇతర సమాచారం కొరకు ICAR-Indian Institute of Oil Palm Research (IIOPR), Pedavegi వారు, ఆయిల్ పామ్ పంట సాగు లోని మెళుకువలను, చిత్రాలు (short films)గా యూట్యూబ్ లో పొందుపరిచారు, వాటిని గాని, ICAR – HOPR వారి ఆయిల్ పామ్ పంట సాగు లోని మెళకువలపై గూగుల్ ప్లేస్టోర్ లో పొందుపరచిన మొబైల్ యాప్స్ (Mobile Apps) ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని, ఉపయోగించుకోవాలని మనవి.
సాంకేతిక సహకారం:
1. డా. ఎం. వి. ప్రసాద్ & డా. కె మనోరమ, భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి, ఆంధ్రప్రదేశ్.
2. డా. బి. ఎన్. రావు, కన్సల్టెంట్ (ఆయిల్ పామ్), తెలంగాణ.