నవతెలంగాణ – ఢిల్లీ
నూతన పార్లమెంట్ విషయంలో మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణి రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఈ క్రమంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవనం శవపేటికలా ఉందంటూ సంచలన ట్వీట్ చేసింది. శవపేటిక, పార్లమెంట్ నూతన భవనం ఫొటోలను ఆదివారం ఉదయం ఆర్జేడీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీనికి యే క్యా హై (ఇది ఏంటి?) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పార్లమెంట్ నూతన భవనాన్ని శవపేటికతో పోలుస్తూ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి.