కోటిన్నర నగదుతో ఆర్ఎంపీ డాక్టర్ పరార్…

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం సమీపంలో హర్ష మొలల వైద్యం చేస్తానంటూ క్లినిక్ పెట్టుకొని కొంత కాలంగా వైద్య సేవలు అందిస్తున్నాడు. 20 సంవత్సరాలుగా వేములవాడలో కుటుంబంతో ఉంటున్న సదరు ప్రయివేటు వైద్యుడు అక్కడున్న వారందరితో పరిచయాలు పెంచుకొని సన్నిహితంగా ఉన్నట్లు నమ్మించాడు. గత నాలుగు ఐదు నెలలుగా తాను సొంత ఇంటిని నిర్మించుకుంటున్నానని నమ్మబలికించి ఒక్కొక్కరి దగ్గర నుండి 5 నుండి 10 లక్షల వరకు దాదాపు 12మంది దగ్గర అప్పు చేశాడు.
మధ్యతరగతి కుటుంబాలు, నిరుపేదలుగా ఉన్న కొందరు, అతడి దగ్గర వైద్య సేవలు పొందినవారు నమ్మి సదరు వైద్యునికి దాదాపు కోటిన్నర నగదు ఇచ్చారు. ఇటీవలే కొందరు తమకు డబ్బులు కావాలని తిరిగి వెళ్లి అడగడంతో కలకత్తాలో తన భార్య పేరిట ఆస్తులు ఉన్నాయని అమ్మి తీసుకువచ్చి ఇస్తానని నమ్మించాడు. నేను ఇక్కడే ఉంటానని భార్య పిల్లలు మాత్రమే వెళ్లి తీసుకు వస్తారని కూడా వారితో చెప్పానట్లుగా తెలిసింది. అయితే పది రోజులుగా కుటుంబంతో సహా కనిపించకపోవడంతో బాధితులు మోసపోయామని భావించారు. దీంతో లబోదిపోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు వైద్యున్ని నమ్మి ఇచ్చామని వాపోయారు. వైద్యున్ని పట్టుకుని వారిడబ్బులు వారికి ఇప్పించాలని వేడుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Spread the love