భాయియో ఔర్ బెహనో, సజ్జణొ ఔర్ దేవియో, మే ఏక్ బినతీ కర్తాహు. వాసే యా తక్ ఏ రోడ్ హమ్నే బనయా హై. నాయకుడు దంచుతూ పోతున్నాడు. ఇన్ని వేల కిలో మీటర్ల రోడ్డు మేమే వేశామన్నాడు. అందుకే ఫలానా రాష్ట్రం నుండి మీ రాష్ట్రం దాకా ఒకేసారి ప్రయాణం చేయొచ్చన్నాడు. మీరు ఆ రహదారి గుండా వచ్చారా అని ప్రశ్నిస్తే లేదు హెలికాప్టరులో వచ్చానన్నాడు నాయకుడు. మరి రోడ్డెందుకు అంటే ప్రజలకోసమన్నాడు. ప్రజలే తన బంధువులన్నాడు. కాని తాను ప్రజల్లో లేనన్న విషయాన్ని ఒప్పుకున్నట్టే అనిపించింది. అయితే ఓటు లేనివాళ్ళు కొందరున్నారంటే వాళ్ళు వేలువిడిచిన, బీరకాయ పీచు బంధువులన్నాడు. హమ్కు ఉన్ లోగోసే కామ్ నహీ హై అనీ అన్నాడు. ఉన్ లోగోసే హమ్ కామోష్ రెహతేహై అనీ అన్నాడు. ఇన్నిన్ని మాటలు పైనుండి వచ్చిన నాయకుడే మాట్లాడితే తానేమైపోవాలను కున్నాడో ఏమో చెవిలో ఏదో గుసగుసలాడాడు. కోపమొచ్చినా నవ్విండు బడా నాయక్.
వింటున్న ప్రజల్లో కొందరు మైమరచిపోయారు. ఇన్నేసి కిలోమీటర్లు రోడ్డెనక రోడ్డు వేస్తే ఇదెలాంటి సడక్ యోజననో కదా అని నర్సింగ్ అడిగీ అడగకనే ”ఏ అధికార్ సడక్ యోజనలా” ఉందన్నాడు యాద్గిరి. ఏం చెప్పినావ్‌ర భై నువ్వు మామూలోడవు కాదురా, పైకి మాట్లాడితే అందరూ వింటారని లోలోన అనుకున్నాడు నర్సింగ్. అంటే బ్రిటిషోళ్ళే కాదు, మనోళ్ళు కూడా తమ వ్యాపారానికి అవసరమైతేనే రోడ్లు వేస్తారని ఈపాటికి అందరికీ అర్థమైపోయుంటుంది నర్సింగు యాద్‌గిరితో సహా. ఆంగ్లేయులు ముడిసరుకును తమ దేశానికి తీసుకుపోయి, తయారైన వస్తువులను మనదేశానికే తెచ్చి మనకే అమ్మేవాళ్ళని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఇదీ అంతే, తామేసుకున్న రోడ్లు, అంతకు ముందు ఉన్న రోడ్లు అన్నీ కలిపి మేమే వేశామని దేశమంతా తిరిగి, అంటే రోడ్డు మీద కాదు ఏ హెలికాప్టరో, విమానమో వాటిద్వారా అన్న మాట తమ రాజకీయ వ్యాపారానికి మనోళ్ళు వాడుకుంటున్నారంతే. మిగతా అంతా సేం టు సేం, తెల్లోడికి నల్లోడికి వ్యాపార విషయంలో తేడాలేమీ లేవు. అందుకే ఆ రహస్యాలను బట్టబయలు చేసేవాళ్ళను దాడిచేస్తామని భయపెట్టి మరీ లోగుట్టు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. అవి దాగుతాయా? దాగవు. ఎంత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేద్దామని చూసినా ఎదురు తిరిగే ధైర్యస్తులు ఉండనే ఉంటారు. దేశమేమీ గొడ్డు పోలేదు ఈ విషయంలో. గాంధీ ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు వేసిన రైళ్ళలో దేశమంతా తిరిగాడో ఆ లెక్కనే ఈ రోడ్లను ఆసరా చేసుకొని ప్రజాస్వామ్యవాదులు తిరిగి ప్రజలక్కావలసిందేదో తెలియజేస్తారు.
ఆల్ రోడ్స్ లీడ్ టూ రోమ్ అన్నట్టు ఇప్పుడు అన్ని రోడ్లు పుణ్యక్షేత్రాలవైపు దారికడుతున్నారు. దేశాభివృద్ధిని ఇప్పుడు ఏ క్షేత్రానికి ఎంతమందిని బస్సుల్లో, రైళ్ళలో, విమానాల్లో తీసుకుపోతున్నారో లెక్క కట్టి మరీ చూపిస్తున్నారు. వినేవాళ్ళు, చదివేవాళ్ళలో కూడా వహ్వా వహ్వా అని చప్పట్లు చరిచేవాళ్ళు భజన బృందాలుగా మారి జేకొడుతున్నారు. సమస్యల వైపు ప్రజల దృష్టి పోకుండా వారిని జోకొడుతున్నారు. విప్లవ గీతాలు పాడినోళ్ళు కూడా దేవుళ్ళ గురించి మాట్లాడి దాన్ని ఫిలాసఫీగా చూస్తు న్నామని తెలియ జేస్తున్నారు. అలా రోడ్డెనక రోడ్డు వేసేవాళ్ళే కాదు, రోడ్లు మారుస్తున్నోళ్ళూ ఉన్నారు అంటే తయారవు తున్నారు. ఇది రోడ్లు మారే కాలం కూడా. ఏరువాక లాగా తమ రాజకీయ పంటలు ఏ రోడ్డు గుండా పోయి ఎక్కడ ఆగితే ఎక్కువగా పండుతాయో అక్కడికి పోవడం సహజ లక్షణం. కప్పలు ఒక చెరువులోనుంచి ఇంకో చెరువులోకి ఎలా దూకుతాయో ఇప్పుడు అంతకన్నా వీరలెవెల్లో ఇంకా చెప్పాలంటే ఒలింపిక్స్‌లో పాల్గొంటే బంగారు పతకాలు వచ్చే విధంగా గెంతులు ఉంటాయిప్పుడు. రహదారి కూడలిలో అంటే క్రాస్ రోడ్స్‌లో ఉన్నామని చెప్పేవాళ్ళు ఇప్పుడు విద్యార్థులే కాదు రాజకీయ నాయకులూ అలాగే ప్రవర్తిస్తారు. ఇది రోడ్డు ఎంచుకునే సమయం మరి.
మాది బైపాస్ రోడ్డు అంటే అందుకే మీరు ఊర్లోకి రారు బయట్నుంచి బయటే వెళ్ళిపోతారు అందుకే మీకు ఊరిలోని సమస్యలేమి తెలుస్తాయి అని కొందరంటే, మీది సర్వీసు రోడ్డు బైపాస్ రోడ్డు గురించి మీకేమి తెలుసునని అటువైపువాళ్ళంటారు. అందుకే మా రోడ్డును కూడా పెద్దరోడ్డు చేసేసి దేశం మొత్తం తిరుగుతామని కొందరు బయలుదేరవచ్చు. ఆనంత పనీ చేస్తారు. ఇక తమ రోడ్డంతా గుంతలు పడ్డ వాళ్ళు మాదే అసలు సిసలైన రోడ్డు దాన్ని బాగా చేస్తే మీ ఇద్దరి రోడ్లు పనికేరావు, మీ రోడ్డులోకి వచ్చిన వారిని కూడా లాగేసి మరీ మా రోడ్డులోకి తెచ్చు కుంటామనవచ్చు. అసలు మీ రోడ్లన్నింటినీ చాపను చుట్టినట్టు చుట్టేసి సముద్రంలో పారేస్తానని ఇంకో పెద్దాయన అనొచ్చు. అసలు సముద్రమే లేని, తెలియని మీరు సముద్రం కోసం చాలా దూరం పోవాలని, మమ్మల్ని దాటి ఎలా పోతారో చూస్తాను అని అసలు రోడ్లే ఎప్పుడూ వేయని ఇంకో చిన్న రాజావారు అనొచ్చు. ఊ అంటే మా మంత్రులను, మమ్మల్ని తిడతారని కోప్పడవచ్చు కూడా.
ఒక్కే రాష్ట్రంలో ఒక రకం రోడ్లు ఉంటాయి. ఒక వేళ తొందరలో తాత్కాలికంగా వేసినామనిపించినా, తరువాత వర్షాలకు అవి కొట్టుకుపోతాయి. ఏ రాష్ట్రంలో ఎలాంటి భూమి ఉందో, అక్కడ ముందుగా వేసిన రోడ్లెలా ఉన్నాయో అని అక్కడి వాళ్ళ సాయం తీసుకుందామంటే అది అన్నిచోట్లా కుదరదు. కానీ ప్రజలు మాత్రం ఏదో ఒక రోడ్డు ఎంచుకోవడం ఖాయం, ఆ ఎంచుకునేదేదో మంచిదే ఎంచుకొమ్మని మాత్రం చెప్పగలం.
జంధ్యాల రఘుబాబు సెల్:9849753298