నదులను తలపిస్తున్న రహదారులు…

నవతెలంగాణ – ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 9 గంటల సమయానికి నది నీటి మట్టం 208.51 మీటర్లకు చేరింది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో ఢిల్లీలోని రహదారులని కూడా నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో హత్నీకుండ్‌ నుంచి హరియాణా నిరంతరంగా వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని కేంద్ర జల కమిషన్‌ అంచనా వేస్తోంది. అదే జరిగితే పరిస్థితి ‘అత్యంత ప్రమాదకరంగా’ మారుతుందని హెచ్చరించింది. అయితే, ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి హరియాణా బ్యారేజ్‌ నుంచి నీటి విడుదల తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీలో భీకర వరదలు సంభవించాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. యమునా నది ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి మోకాలి లోతు నీరు చేరి నదులను తలపిస్తున్నాయి. సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో రింగ్‌ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్‌ – మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలకు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది.
roads-crossing-rivers
roads-crossing-rivers

Spread the love