హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

Robbery in Hyderabad Express– చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి
శింగరాయకొండ : హైదరాబాద్‌, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఒక రైలులో దోపిడీ, మరో రైలులో దోపిడీయత్నం జరగడంతో ప్రయాణికులు ఆందోళనకు గుర్యారు. ఈ సంఘటన నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఉలవపాడు మండలం వీరేపల్లి తిప్పల వద్ద ఎనిమిది మంది దుండగులు చైన్‌లాగి నిలిపివేశారు. దొంగలు ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6, ఎస్‌7 బోగీల్లోకి ప్రవేశించి కత్తులు చూపించి ప్రయాణికుల నుంచి బంగారం, నగదు, సెల్‌ఫోన్లు దోచుకుని పరారయ్యారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే మరో రైలులో దోపిడీకి ప్రయత్నించారు. సికింద్రబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును గుడ్లూరు మండలం వీరేపల్లి వద్ద ఉన్న సిగల్‌కు గుడ్డ కట్టి రైలును నిలుపుదల చేశారు. ఆ రైలులో ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని ఎదుర్కొనారు. దీంతో వారిపై రాళ్లు రువ్వి దోపిడీ దొంగలు పరారయ్యారు. రెండు బోగీలపై రాళ్లతో దాడులు చేయడంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలపై ప్రయాణికులు తెట్టు, కావలి రైల్వే పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love