శ్రమశక్తితో దోబూచులాట

దేశ సంపదకు వెలుగులిచ్చే
శ్రమశక్తి ఊపిరికి
ఉరితాళ్ళు లేబర్‌ కోడ్‌లు
శ్రమజీవుల జీవితాల చుట్టూ
కమ్ముకునే కాటుక చీకట్లు
ఆధునిక హిట్లరు దగుల్బాజీ
ఆలోచన నుండి పుట్టుకొచ్చిన సంకెళ్ళు
పార్లమెంటు ఊపిరిలేని బొమ్మయింది
చర్చ అసూర్యంపశ్య అయింది
సభ్యులు ప్రాణమున్న బొమ్మలయిండ్రు
వాళ్ళ నోళ్ళు మూసుకపోయినయి
కాళ్ళు కదలడం మానేసి కట్టెలయినయి
ప్రతిపక్ష సభ్యుల మాటలకు సీళ్ళు
వాళ్ళ ఆమోదముద్ర లేదు
ఏకపక్షంగా చట్టమై నెత్తినెక్కింది
కార్మిక శక్తిని బానిస శక్తిగా మార్చే
కొత్త శ్రమ హింసా డాక్టరు కుర్చీ
లేబర్‌ కోడుల చట్టం నూతన వేతన చట్రం
కనీస వేతన చట్టాన్ని శ్మశానానికి చుట్టాన్ని చేసింది స్వామ్యం
బోనస్‌ చెల్లింపు చట్టం గుండె మాయమైంది
సామాజిక భద్రతా నియమావళికి
శాశ్వత అజ్ఞాత వాసముద్ర
కార్మిక శక్తి గుండె రగిలి ఏకమై గొంతెత్తితే
కొత్త లేబర్‌ కోడ్‌లకు ఉద్వాసన
– వల్లభాపురం జనార్థన, 9440163687

Spread the love