‘రోబో’ ఆత్మహత్య..యావత్ ప్రపంచం నివ్వెరపోయే న్యూస్

నవతెలంగాణ-హైదరాబాద్ : జీవితంలో కష్టాలను ఎదుర్కోలేక కొందరు మనుషులు ఆత్మహత్య హత్యలు చేసుకుంటారని తెలుసు.. కానీ మర మనిషి ‘ఆత్మహత్య’ చేసుకోవడం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు.. యావత్ ప్రపంచమే నివ్వెరపోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో ఒక రోబో ఇటీవల ‘ఆత్మహత్య’ చేసుకుంది. గుమీ నగరంలోని సిటీ హాల్ ఆఫీసులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఒక రోబో ఉద్దేశపూర్వకంగానే రెండు మీటర్ల పొడవున్న మెట్ల మీద నుంచి దూకింది. ఏమాత్రం కదలికలు లేని స్థితిలో దాన్ని గుర్తించారు. తనను తాను అంతం చేసుకొనే ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని.. ఒకేచోట అదేపనిగా గుండ్రంగా తిరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధిక పనిభారం లేదా యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను దేశంలోనే తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియాతోపాటు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ఘటనను ‘ఆత్మహత్య’గా పేర్కొనడం నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే.. రోబోలు భావోద్వేగాలకు గురయ్యే లేదా తనను తాను అంతం చేసుకొనే సామర్థ్యం ఉండనందున ఇది ఎలా జరిగి ఉండొచ్చన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రోబో కదలికలకు దోహదపడే నేవిగేషన్ లో లోపాలు, సెన్సార్ల వైఫల్యం, ప్రోగ్రామింగ్ లో బగ్ వల్ల రోబో ఇలా విచిత్రంగా ప్రవర్తించి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది.

Spread the love