చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ

నవతెలంగాణ – హైదరాబాద్
ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో సహచరుడు విరాట్‌ కోహ్లి (11864) తర్వాత 11000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సన్‌రైజర్స్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్‌లో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద హిట్‌మ్యాన్‌ ఈ మైలురాయిని దాటాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ బౌండరీలు బాదిన రోహిత్‌.. చాలాకాలం తర్వాత తన స్థాయికి తగ్గ ఆట ఆడాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 42 హాఫ్‌ సెంచరీ ( 37 బంతుల్లో 56) పూర్తి చేసుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో రోహిత్‌ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్‌లో ఓ టీమ్‌ (ముంబై ఇండియన్స్‌, 5012 పరుగులు) తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఆర్సీబీ తరఫున విరాట్‌ కోహ్లి అత్యధికంగా 7162 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై టీమ్‌ సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. రోహిత్‌తో పాటు కెమారూన్‌ (77) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫలితంగా ఆ జట్టు 15 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. అంతకుముందు వివ్రాంత్‌ శర్మ (69), మయాంక్‌ అగర్వాల్‌ (83) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

Spread the love