నవతెలంగాణ – హైదరాబాద్
క్రిస్ గేల్ రికార్డును తాను బద్దలు కొడితే బాగుంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐనప్పటికీ ఇలాంటి విషయాల గురించి తాను ఎక్కువగా ఆలోచించనన్నారు. 2007లో ఆరంగేట్రం చేసిన రోహిత్ ఖాతాలో వన్డేల్లో 280, టీ20ల్లో 182 సిక్సులు, టెస్టుల్లో 77 సిక్సులు ఉన్నాయి. సిక్సర్ల విషయంలో మిగతా టీమిండియా ఆటగాళ్ల కంటే ముందున్నాడు. ధోనీ చొరవతో ఓపెనర్‌గా మారిన రోహిత్ శర్మ హిట్ మ్యాన్‌గా పేరొందాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ నిలిచాడు. 483 మ్యాచ్‌లలో 553 సిక్సులు కొట్టాడు. ఈ రికార్డుకు రోహిత్ శర్మ (539 సిక్సులు) కేవలం 15 సిక్సుల దూరంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన రికార్డ్ అవుతుంది. క్రిస్ గేల్ రికార్డును నేనే బ్రేక్ చేస్తానని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఇది తమాషాగా ఉంది. నేను కండపుష్టిని కలిగిన బ్యాటర్‌ను కాదు.. కానీ బంతిని బలంగా కొట్టడం నాకు ఇష్టం’ అని రోహిత్ అన్నాడు.