అటవీ భూముల్లో నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌

RRR alignment from forest lands– మూడు నిర్మాణ ప్రతిపాదనలు
– మొదటి దానికే సర్కారు ఓటు
– ఆ భూముల కోసం ప్రయత్నం
– రోడ్ల భవనాల శాఖ కసరత్తు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆలస్యమవుతున్న ప్రాంతీయ వల రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హైదరాబాద్‌ మహానగర శివారులో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అవతలివైపు నిర్మించే రీజినల్‌ ింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి అవసరమైన అటవీ భూముల బదిలీ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతో సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా వినతి సమర్పించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సమాయత్తమవుతున్నది. ఈ ప్రాజెక్టులో మొత్తం మూడు అలైన్‌మెంట్‌లు ఉంటే అందులో ఫస్ట్‌ అలైన్‌మెంట్‌కు పొందాల్సిన అనుమతులపై ప్రధానంగా దష్టిపెట్టింది. ఇప్పటికే సీఎం, మంత్రి పలుార్లు సంబంధిత కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అవసరమైన అనుమతులను వేగంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ఈ ప్రణాళికకు తగినట్టు రోడ్లు భవనాల శాఖ అధికారులు కూడా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి
ఓఆర్‌ఆర్‌ వెలుపల రెండు భాగాలుగా 347.84 కి.మీ. మేర రీజినల్‌ రింగ రోడ్డుకు డిజైన్‌ ఖరారైంది. దక్షిణ భాగంలో చౌటుప్పల్‌-ఆమనగల్లు-షాద్‌నగర్‌-సంగారెడ్డి మీదుగా వెళ్లే 186 కి.మీ. రహదారిలో కొంత మేర నర్సాపూర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ మీదుగా వెళుతున్నది. రహదారి నిర్మాణానికి అటవీ భూములు కావాల్సి ఉన్నందున ఆ శాఖ నుంచి అనుమతి పొందడం తప్పనిసరైంది. రహదారి కోసం సేకరించే అటవీ భూమికి రాష్ట్ర అటవీశాఖతో పాటు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్ల భవనాల శాఖ అధికారులు రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలకు అనుమతి లభించినా భూసేకరణ కోసం అటవీ శాఖకు రెవెన్యూ అధికారులు గతేడాది మార్చిలోనే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేశారు. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా దాన్ని తిరస్కరించారు. అయితే, మళ్ళీ ఫీల్డ్‌ సర్వే నిర్వహించడంతో పాటు అన్ని అంశాలను సమగ్రంగా క్రోడీకరించి ఇంజినీరింగ్‌ విభాగం నివేదికను రూపొందించింది.
మొదటి అలైన్‌మెంట ఎందుకు?
ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి మూడు అలైన్‌మెంట్లను ఆర్‌అండ్‌బీ ప్రతిపాదించింది. ఉత్తర భాగం 158.64 కిలోమీటర్ల మేర ఉండే మొదటి అలైన్‌మెంటుకు రూ.8407 కోట్లు ఖర్చవుతుంది. సంగారెడ్డి, మాసాయిపేట, తూఫ్రాన్‌, నాగులపల్లె, గజ్వేల్‌, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్‌ గుండా వెళుతుంది. దీని కోసం 153.7 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇందులో 7.2 కిలోమీటర్ల అటవీ భూమి కూడా ఉంది. మిగతా రెండు అలన్‌మెంట్లు నిడివితోపాటు నిధులు కూడా అధికంగా ఖర్చవుతాయి. ఎక్కువ అటవీ భూములున్నాయి. దీంతో సర్కారు తొలి అలైన్‌మెంట్‌ అనుమతి కోసం మాత్రమే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ అలైన్‌మెంట్‌లో కీలకమైన నగరంతోపాటు జిల్లాల్లోని ఆయా ప్రాంతాలు అనుసంధానం కానుండడమూ ఒక ప్రధాన కారణం. అలాగే మిగతా రెండు అలైన్‌మెంట్లతో పోలిస్తే నిడివి తక్కువ. అటవీ శాఖ భూములు తీసుకోవడం అనివార్యమే అయినా కొన్ని చెరవులు సైతం ఉన్నాయి. ఇకపోతే సుమారు 45 వేల చెట్లను, 15 వేల కుటుంబాలను అక్కడి నుంచి తరలించాల్సి వస్తున్న తరుణంలో అటవీ శాఖ అనుమతి తప్పనిసరి కానుంది.

Spread the love