రూ.లక్ష స్కీంను అన్ని బీసీ కులాలకు వర్తింపజేయాలి

– బీసీ బంధు ప్రవేశ పెట్టాలి
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య
– మంత్రి గంగుల కమలాకర్‌కు వినతి
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన రూ.లక్ష స్కీంను అన్ని బీసీ కులాలకు వర్తింపజేయాలనీ, బీసీబంధు పథకం ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంత రం కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి 5 కులాలకు ప్రకటించిన రూ.లక్ష పథకాన్ని బీసీ జాబితాలోని 130 కులాలకు వర్తింపజేయాలనీ, వారం రోజుల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి బీసీ కుటుంబానికి బీసీబంధు ప్రవేశపెట్టి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. బీసీ కార్పొరేషన్‌లో పెండింగ్‌లో ఉన్న రూ.5లక్షలా 47 వేల మందికి వెంటనే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. ఇంజినీరింగ్‌/ఎంబీఏ/ఎంసీఏ/ పీజీ/డిగ్రీ/ఇంటర్‌ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీంను పునరుద్ధరించాలని కోరారు. పెరిగిన ధరల ప్రకారం మిస్‌ చార్జీలు, స్కాలర్‌ షిప్స్‌ పెంచుతూ జీవో జారీ చేయాలన్నారు. ప్రతి అసెం బ్లీ నియోజకవర్గంలో రెండు బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలన్నారు. విదేశీ విద్య స్టైఫండ్‌ స్కీమ్‌ అర్హులందరికీ ఇవ్వడానికి బడ్జెట్‌లో రూ.60 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలన్నారు. గురుకుల పాఠశాలల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.200 కోట్ల కేటాయించా లనీ, 12 బీసీ కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. బీసీల ప్రతి డిమాండ్‌నూ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ హామీనిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, అంజి, వేముల రామకృష్ణ, టి.నందగోపాల్‌, రాజ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love