28న ఎన్టీఆర్‌ పేర రూ.100 నాణెం విడుదల

– రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరణ
– హాజరు కానున్న చంద్రబాబు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు పేర ఈనెల 28న కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణాన్ని విడుదల చేయనుంది. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతులమీదుగా జరగనుంది. దీనికోసం ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులంతా ఢిల్లీకి వెళుతున్నారు. అలాగే తెలుగుదేశం అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు కేంద్ర ఆహ్వానాలు పంపింది. ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ సైతం వస్తారని భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్రం ఎన్టీఆర్‌ నాణాన్ని రూపొందించారు. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, ఐదు శాతం నికెల్‌, మరో ఐదు శాతం జింక్‌తోపాటు తయారుచేశారు. ఇకపోతే నాణేనికి ఒకవైపు మూడు సింహాలతోపాటు అశోక చక్రం ఉండగా, మరోవైపు ఎన్టీఆర్‌ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారకరామారావు శతజయంతి అని హిందీభాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాది ముగిసిన విషయం విదితమే. కావున 1923-2023లో అని ముద్రితమై ఉంటుంది. ఇదిలావుండగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబునాయుడు ఈనెల 28న ఢిల్లీకి వెళుతున్నారు.
ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో భేటి కానున్నారు. ఏపీలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు.

Spread the love