గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్లు విడుదల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమావేశమై వివిధ పనులకు సంబంధించి నిధుల విడుదలపై చర్చించారు. రూ.1190 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నిధుల విడుదలతో గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెరుగనున్నది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సర్పంచుల సంఘం ప్రతినిధులు కలిసి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తోపాటు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, హరీశ్‌ రావుకు ధన్యవాదాలు తెలిపారు. జేపీఎస్‌లను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు. ఈ విషయంలో చొరవ తీసుకుని పనిచేసిన మంత్రి ఎర్రబెల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్‌, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు బూడిద రాంరెడ్డి, తదితరులున్నారు.

 

Spread the love