– సెన్సెక్స్ 796 పాయింట్ల పతనం
ముంబయి : గత రెండు వారాలుగా వరుస లాభాలతో జోరు మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవి చూశాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండిస్టీస్ తదితర బ్లూచిప్ కంపెనీల సూచీల్లో అమ్మకాల పరంపర చోటు చేసుకుంది. దీంతో వరుసగా రెండోరోజూ నష్టాలు నమోదయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల వాతావరణానికి తోడు ఇప్పటికే భారీగా పెరిగిన సూచీల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. బిఎస్ఇ సెన్సెక్స్ 796 పాయింట్లు కోల్పోయి 66,801కి పరిమితమయ్యింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 232 పాయింట్లు పతనమై రూ.19,980.75 వద్ద ముగిసింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున తగ్గాయి. ఒక్క పూటలో మదుపర్లు దాదాపు రూ.2.25 లక్షల కోట్లు నష్టపోయారు. రెండు సెషన్లలో రూ.2.89 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అత్యధికంగా 4 శాతం, రిలయన్స్ ఇండిస్టీస్ 2 శాతం, జెఎస్డబ్ల్యు స్టీల్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 67,000, నిఫ్టీ 20,000 కీలక మైలురాళ్ల నుంచి కిందకి జారుకున్నాయి.