రూ.2 లక్షల కోట్ల సంపద ఆవిరి

– సెన్సెక్స్‌ 888 పాయింట్ల పతనం
– లాభాల స్వీకరణతో భారీ నష్టాలు

ముంబయి : వరుసగా ఆరు రోజులుగా ర్యాలీ చేసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం కుప్ప కూలాయి. లాభాల స్వీకరణతో సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీ నష్టాలు చవి చూశాయి. ఒక్క పూటలోనే రూ.2 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. ఇన్ఫో సిస్‌, రిలయన్స్‌, టిసిఎస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ తదితర ప్రధాన సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 888 పాయింట్లు లేదా 1.3 శాతం పతనమై 66,684కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 1,000 పాయింట్లు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 234 పాయింట్లు లేదా 1.17 శాతం కోల్పోయి 19,745 వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్‌ షేర్‌ ఏకంగా 7.7 శాతం నష్టపోయింది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 3.65 శాతం, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీ 3.33 శాతం, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 3.19 శాతం, విప్రో 3.07 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ 0.26 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.13 శాతం చొప్పున తగ్గాయి. నిఫ్టీలో ఐటి సూచీ ఏకంగా 4 శాతం పతనాన్ని చవి చూసింది. ఎఫ్‌ఎంసిజి 1 శాతం నష్టపోయింది. పిఎస్‌యు బ్యాంకింగ్‌, మీడియా, ఆటోమొబైల్‌ సూచీలు 0.5 శాతం మేర పెరిగాయి.
ఒక్క మాటతో మస్క్‌కు లక్షల కోట్ల దెబ్బ
అమెరికాలోని దిగ్గజ ఇవి కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ మాట్లాడిన ఒక్క మాటా ఆయనకు లక్షల కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టింది. టెస్లా కార్ల ధరలను తగ్గిస్తామని మస్క్‌ చేసిన ప్రకటనతో గురువారం నాస్‌డాక్‌లో ఆ కంపెనీ షేర్లు 9.7 శాతం పతనమై 262.90 డాలర్లకు పడిపోయాయి. దీంతో మస్క్‌ వ్యక్తిగత సంపద 20.3 బిలియన్‌ డాలర్లు ఆవిరయ్యింది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.1.65 లక్షల కోట్లుగా ఉంటుంది.

Spread the love