రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి– సెన్సెక్స్‌ 886 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను మూటగట్టుకు న్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 886 పాయింట్లు లేదా 1.08 శాతం పతనమై 80,982కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 293 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 24,718 వద్ద ముగిసింది. ఒక్క పూటలోనే బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4.56 లక్షల కోట్లు ఆవిరై.. రూ.457.06 లక్షల కోట్లుగా నమోదయ్యింది. దీంతో ఆ మొత్తం మదుపర్లు నష్టపోయినట్లయ్యింది.
పశ్చిమాసియాలో ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ముడి చమురు ధరల పెరుగుదల, కార్పొరేట్‌ సంస్థల ఆర్థిక ఫలితాలు అంచనాలు చేరకపోవడం, అమెరికా, ఆసియా మార్కెట్లలో ప్రతికూలాంశాలు భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. నిఫ్టీ50లోని 42 స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్‌-30లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, నెస్లే మినహా మిగితా స్టాక్స్‌ అన్నీ నేల చూపులు చూశాయి. నిఫ్టీలో రియాల్టీ, ఆటో, ఐటి, లోహ సూచీలు అధికంగా 2-3 శాతం వరకు విలువ కోల్పోయాయి. ఫార్మా, వైద్య స్టాక్స్‌ మాత్రమే సానుకూలంగా నమోదయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు 1.2 శాతం వరకూ పతనం అయ్యాయి.

Spread the love